Electric SUVs : 2026లో ఎలక్ట్రిక్ కార్ల జాతర.. టాటా, మారుతి మధ్య అసలైన పోరు
టాటా, మారుతి మధ్య అసలైన పోరు

Electric SUVs : ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వచ్చే 2026 సంవత్సరంలో దిగ్గజ కంపెనీలు తమ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యాయి. టాటా సియెర్రా నుంచి మారుతి సుజుకి తొలి ఈవీ వరకు.. వచ్చే ఏడాది రోడ్లపై రచ్చ చేయబోతున్న ఆ 5 అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. టాటా సియెర్రా ఈవీ : ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన ఐకానిక్ బ్రాండ్ సియెర్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో తిరిగి రాబోతోంది. ఇప్పటికే ఈ కారు లాంచ్ కాకముందే భారీ క్రేజ్ సంపాదించుకుంది. 2026 ద్వితీయార్థంలో విడుదల కానున్న ఈ కారు కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అదిరిపోయే డిజైన్, లగ్జరీ ఇంటీరియర్‌తో రాబోతున్న ఈ కారు టాటా మోటార్స్ ఈవీ విభాగంలో గేమ్ ఛేంజర్ కానుంది.
2. మారుతి సుజుకి ఈ-విటారా : మారుతి సుజుకి నుంచి రాబోతున్న మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ కారు ఇదే. జనవరి 2, 2026న ఇది ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో రాబోతున్న ఈ కారు, ఎలక్ట్రిక్ మార్కెట్లో మారుతి సత్తాను చాటనుంది.
3. టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ : ఇప్పటికే మార్కెట్లో ఉన్న పంచ్ ఈవీకి 2026లో కొత్త హంగులు అద్దబోతున్నారు. సియెర్రా ఈవీ లాంచ్ తర్వాత దీని అప్‌డేటెడ్ వెర్షన్ రానుంది. ఇందులో కొత్త డిజైన్ ఎలిమెంట్స్, మరిన్ని అధునాతన ఫీచర్లు, అప్‌డేటెడ్ బ్యాటరీ ప్యాక్ ఉండబోతున్నాయి. చిన్న సైజు ఎస్‌యూవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
4. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ : వియత్నామీస్ కంపెనీ విన్‌ఫాస్ట్ ఫిబ్రవరి 2026 నాటికి భారత మార్కెట్లోకి తన మూడవ ఈవీ మోడల్‌ను తీసుకురాబోతోంది. ఇది ఒక ఎలక్ట్రిక్ ఎంపీవీ సెగ్మెంట్‌లో రానుంది. కియా క్లావిస్ ఈవీ, బివైడి ఈ-మ్యాక్స్ 7 వంటి కార్లకు ఇది గట్టి పోటీని ఇవ్వనుంది. దీని లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5. కియా సైరోస్ ఈవీ : కియా ఇండియా తన ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో సైరోస్ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను 2026 ద్వితీయార్థంలో లాంచ్ చేయనుంది. ఫ్యూచరిస్టిక్ స్టైలింగ్, హై-టెక్ ఫీచర్లు, మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఈ కారు రాబోతోంది. ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఇది టాప్‌లో నిలిచే అవకాశం ఉంది.

