Hybrid Cars : మైలేజ్‌లో వీటికి తిరుగే లేదు.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1000 కిలోమీటర్లు వెళ్లే టాప్ 5 కార్లు ఇవే!
ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1000 కిలోమీటర్లు వెళ్లే టాప్ 5 కార్లు ఇవే!

Hybrid Cars : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంధన ధరల మంటతో సామాన్యుడితో పాటు మధ్యతరగతి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే కార్ల కోసం కస్టమర్లు ఆరాటపడుతున్నారు. అందుకే మార్కెట్లో ఇప్పుడు హైబ్రిడ్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ కార్లలో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. దీనివల్ల కారు మైలేజ్ అద్భుతంగా పెరగడమే కాకుండా కాలుష్యం కూడా చాలా వరకు తగ్గుతుంది.
సాధారణంగా మార్కెట్లో మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ అనే రెండు రకాల సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కేవలం ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి, పికప్‌కు మాత్రమే సహాయపడుతుంది. కానీ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు చాలా ప్రత్యేకమైనవి. ఇవి పెట్రోల్ అవసరం లేకుండా కేవలం ఎలక్ట్రిక్ మోటార్ బ్యాటరీ సహాయంతోనే కొన్ని కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించగలవు. అందుకే వీటి ఫ్యూయల్ ఎఫిషియన్సీ సాధారణ పెట్రోల్ కార్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు తరచుగా లాంగ్ జర్నీలు చేసేవారైతే, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ 5 కార్ల వివరాలు చూద్దాం.
1. హోండా సిటీ ఈ:హెచ్‌ఈవీ
సెడాన్ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు ఇది. లగ్జరీతో పాటు అద్భుతమైన మైలేజ్, భద్రతను ఈ కారు అందిస్తుంది. ఇందులో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది 125 bhp పవర్‌ను, 253 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి e-CVT గేర్‌బాక్స్ అనుసంధానించబడి ఉంటుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 40 లీటర్లు. ఇది లీటరుకు 27.26 కిమీ మైలేజ్ ఇస్తూ, ఫుల్ ట్యాంక్‌పై 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.19.48 లక్షలు.
2. మారుతి సుజుకి గ్రాండ్ విటారా
సిటీ రైడింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఇది చాలా పర్‌ఫెక్ట్ ఎస్‌యూవీ (SUV). తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ఎక్కువ మైలేజ్ ఇవ్వడం దీని ప్రత్యేకత. ఇందులో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ ఉంటుంది. ఇది 114 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 45 లీటర్లు. ఇది లీటరుకు 27.97 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, కీలెస్ ఎంట్రీ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.16.63 లక్షలు.
3. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
ఈ కారు మారుతి గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్, టెక్నాలజీ ఆధారంగానే తయారైంది. అందువల్ల దీని లుక్ మినహా మైలేజ్, పర్ఫార్మెన్స్ అన్నీ దాదాపు సమానంగా ఉంటాయి. ఇందులో కూడా 114 bhp పవర్‌ను ఇచ్చే 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ సిస్టమ్ కలవు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్లు. ఇది కూడా లీటరుకు 27.97 కిమీ మైలేజ్ ఇస్తూ, ఫుల్ ట్యాంక్‌పై 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పలు రకాల అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో అందించారు. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.16.77 లక్షలు.
4. టయోటా ఇన్నోవా హైక్రాస్
భారతీయ మార్కెట్లో పెద్ద కుటుంబాలకు, లాంగ్ జర్నీలు చేసేవారికి ఇన్నోవా హైక్రాస్ ఒక ప్రీమియం లగ్జరీ ఇల్లు లాంటిది. ఎంపీవీ విభాగంలో దీనికి తిరుగులేని క్రేజ్ ఉంది. ఇందులో పెద్ద 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజన్, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది రికార్డు స్థాయిలో 186 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 52 లీటర్లు. ఇంత పెద్ద కారు అయినప్పటికీ ఇది లీటరుకు 23.24 కిమీ అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. దీనివల్ల ఫుల్ ట్యాంక్‌పై 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ లభిస్తుంది. ADAS సేఫ్టీ, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, అంబియంట్ లైటింగ్, లగ్జరీ కెప్టెన్ సీట్లు ఇందులో ఉన్నాయి. దీని హైబ్రిడ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.26.91 లక్షలు.
5. మారుతి సుజుకి ఇన్విక్టో
ఇది మారుతి సుజుకి కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఎంపీవీ కారు. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ను బేస్ చేసుకుని తయారైనప్పటికీ, కేవలం స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇన్నోవా హైక్రాస్ లాగే ఇందులో కూడా 186 bhp పవర్‌ను ఇచ్చే 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ ఉంటుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 52 లీటర్లు, మైలేజ్ లీటరుకు 23.24 కిమీ గా ఉంటుంది. ఇది కూడా ఫుల్ ట్యాంక్‌పై 1200 కిలోమీటర్ల మైలేజ్ రేంజ్ ఇస్తుంది. పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో కలవు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.28.64 లక్షలు.

