మధ్యతరగతికి వరంగా మారిన టాప్ 5 కార్లు ఇవే

Mileage Cars: ప్రస్తుత రోజుల్లో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అందుకే కొత్త కారు కొనాలనుకునే వారు స్టైల్ కంటే ముందే మైలేజీ గురించే ఆరా తీస్తున్నారు. పెట్రోల్ కార్లలో కూడా డీజిల్ కార్లకు ధీటుగా అత్యధిక మైలేజీ ఇచ్చే కొన్ని మోడల్స్ మన భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఉండి, ప్రతి లీటర్ పెట్రోల్‌కు పూర్తి విలువను ఇచ్చే టాప్ 5 కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

మొదటగా మైలేజీ రారాజు మారుతి సుజుకి సెలెరియో గురించి చెప్పుకోవాలి. ఇందులో ఉన్న 1.0 లీటర్ K10C ఇంజిన్ వల్ల ఇది లీటరుకు ఏకంగా 26.68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో తిరగడానికి ఈ కారు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండటం వల్ల రద్దీ రోడ్లపై కూడా సునాయాసంగా నడపవచ్చు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.37 లక్షల నుంచి రూ.7.05 లక్షల మధ్యలో ఉంది.

కుటుంబ అవసరాల కోసం ఎంతో పేరుగాంచిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కూడా మైలేజీలో అదరహో అనిపిస్తోంది. దీని 1.0 లీటర్ ఇంజిన్ వేరియంట్ లీటరుకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఈ కారులో ఉండే విశాలమైన క్యాబిన్, హెడ్-రూమ్ వల్ల సుదీర్ఘ ప్రయాణాలు కూడా ఎంతో హాయిగా సాగుతాయి. దీని ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.38 లక్షల వరకు ఉంటుంది.

ఇక బడ్జెట్ కార్ల గురించి మాట్లాడితే మారుతి సుజుకి ఆల్టో K10 పేరు ముందు వరుసలో ఉంటుంది. తొలిసారి కారు కొనేవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది లీటరుకు సుమారు 24.39 నుంచి 24.90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్, నమ్మదగ్గ పర్ఫార్మెన్స్ ఈ కారు సొంతం. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంది.

కేవలం మైలేజీ మాత్రమే కాదు, పటిష్టమైన భద్రత కూడా కావాలనుకునే వారి కోసం టాటా టియాగో సిద్ధంగా ఉంది. 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కారు, తన 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో లీటరుకు సుమారు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకుండా మంచి మైలేజీ కావాలనుకునే వారు టియాగోను ఎంచుకోవచ్చు. దీని ధర రూ.5.65 లక్షల నుంచి రూ.8.35 లక్షల మధ్యలో ఉంటుంది.

చివరిగా యువత మనసు దోచుకున్న మారుతి సుజుకి స్విఫ్ట్. దీని సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజిన్ లీటరుకు దాదాపు 25 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు ఇంధనాన్ని ఆదా చేయడంలో స్విఫ్ట్ ఎప్పుడూ ముందే ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.50 లక్షల వరకు ఉంది. ఈ ఐదు కార్లు కూడా నేటి పెట్రోల్ ధరల కాలంలో మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story