Safety Rated Cars : ప్రస్తుత రోజుల్లో కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది కేవలం మైలేజ్, లుక్స్ మాత్రమే కాకుండా సేఫ్టీకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడాలంటే మంచి సేఫ్టీ రేటింగ్ ఉండటం చాలా అవసరం. అందుకే వాహన తయారీ కంపెనీలు కూడా తక్కువ ధర కార్లలోనే అద్భుతమైన భద్రతా ఫీచర్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, గరిష్ట రక్షణనిచ్చే 5-స్టార్ రేటింగ్ కారు కావాలనుకుంటే, భారత మార్కెట్లో లభిస్తున్న ఐదు అత్యుత్తమ కార్ల వివరాలు మీకోసం.

టాటా పంచ్

ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది టాటా పంచ్. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.64 లక్షలుగా ఉంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ప్రయాణికుల భద్రత కోసం ఇందులో ఏకంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లను టాటా మోటార్స్ అందించింది.

నిస్సాన్ మ్యాగ్నైట్

మీకు తక్కువ ధరలోనే ఒక సురక్షితమైన, స్టైలిష్ ఎస్‌యూవీ కావాలనుకుంటే నిస్సాన్ మ్యాగ్నైట్ ఒక అద్భుతమైన ఎంపిక. దీని ప్రారంభ ధర రూ. 5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో పెద్దల భద్రత విభాగంలో ఈ మోడల్ 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, టీపీఎమ్‌ఎస్, బలమైన బాడీ స్ట్రక్చర్ వంటి అవసరమైన అన్ని రక్షణ వసతులు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్

హ్యాచ్‌బ్యాక్ కార్లను ఇష్టపడే వారి కోసం టాటా ఆల్ట్రోజ్ అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. భారత్ NCAP టెస్టులో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి తన బలాన్ని నిరూపించుకుంది. ఈ కారులోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లను అందించారు, ఇవి ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు గరిష్ట రక్షణను కల్పిస్తాయి.

మారుతి సుజుకి డిజైర్

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన కారుగా అవతరించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.26 లక్షలు. ఈ కారు గ్లోబల్ NCAP, భారత్ NCAP రెండింటిలోనూ అద్భుతంగా రాణించి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), పిల్లల రక్షణ కోసం ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ చాలా కాలంగా దేశంలోనే అత్యంత సురక్షితమైన, బలమైన కారుగా పేరు తెచ్చుకుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.37 లక్షలుగా ఉంది. ఈ పాపులర్ ఎస్‌యూవీ గ్లోబల్ NCAP, భారత్ NCAP లలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటే, ఇది కళ్ళు మూసుకుని ఎంచుకోదగ్గ అత్యంత నమ్మకమైన కారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story