మధ్య తరగతి వాళ్లు కూడా ఈ కారు ఈజీగా కొనేయొచ్చు

Cheapest 7 Seater Cars : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ కార్ల హవా నడుస్తోంది. మునుపటిలా కాకుండా, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేదా ఎక్కువ మంది స్నేహితులతో కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఉండే 7-సీటర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒకప్పుడు ఏడుగురు కూర్చునే కారు అంటే కేవలం ధనవంతులకే పరిమితం అనుకునేవారు, కానీ ఇప్పుడు మధ్యతరగతి జేబుకు చిల్లు పడకుండా, బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఎంపీవీ, ఎస్‌యూవీ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరలో ఎక్కువ స్పేస్, మెరుగైన మైలేజ్ ఇచ్చే టాప్-5 చౌకైన 7-సీటర్ కార్ల వివరాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి.

నిస్సాన్ కంపెనీ నుంచి వచ్చిన నిస్సాన్ గ్రావైట్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.5.65 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారు, చూడటానికి రెనో ట్రైబర్‌ను పోలి ఉన్నప్పటికీ, నిస్సాన్ తనదైన విలక్షణమైన డిజైన్ మరియు గ్రిల్‌తో దీనికి కొత్త రూపునిచ్చింది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్నప్పటికీ, తెలివైన ఇంజనీరింగ్ వల్ల లోపల మూడు వరుసల సీట్లను చాలా సౌకర్యవంతంగా అమర్చారు. చిన్న కుటుంబాలకు, నగర ప్రయాణాలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.

బడ్జెట్ ధరలో 7-సీటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రెనాల్ట్ ట్రైబర్. దీని ధర రూ.5.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఇందులోని సీట్లను మన అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. రెండో వరుస సీట్లను ముందుకు వెనక్కు జరుపుకునే వెసులుబాటు ఉండటం వల్ల వెనుక కూర్చునే వారికి కాళ్లు ఫ్రీగా ఉంటాయి. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 72 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. మైలేజ్, స్పేస్ విషయంలో దీనికి సాటిలేదు.

ఇక మొండితనానికి, గతుకుల రోడ్లపై సాఫీగా వెళ్లడానికి పేరుగాంచిన మహీంద్రా బొలెరో ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ పాత తరం ఎస్‌యూవీని ఇప్పుడు కొత్త ఫీచర్లతో ఆధునీకరించారు. లెదర్ సీట్లు, స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్, 17.8 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో దీనిని అప్‌గ్రేడ్ చేశారు. మరోవైపు, దీనికి కొంచెం మోడ్రన్ లుక్ కావాలనుకునే వారి కోసం మహీంద్రా బొలెరో నియో అందుబాటులో ఉంది. దీని ధర రూ.8.69 లక్షల నుంచి రూ.10.94 లక్షల వరకు ఉంటుంది. ఇది బొలెరో కంటే ఎక్కువ కంఫర్ట్, ప్రీమియం ఇంటీరియర్స్‌ను అందిస్తుంది.

చివరగా, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ ఎంపీవీగా మారుతి సుజుకి ఎర్టిగా తన రికార్డును కొనసాగిస్తోంది. రూ. 8.80 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారులో 1.5 లీటర్ శక్తివంతమైన ఇంజిన్ ఉంది. ఇది 103 పీఎస్ పవర్, 139 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్స్ వెళ్లేవారికి అల్ట్రిగా మొదటి ప్రాధాన్యత. ఇదే కారును టయోటా సంస్థ రూమియన్ పేరుతో విక్రయిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకు అన్ని విధాలా సరిపోయే కారు ఇది.

PolitEnt Media

PolitEnt Media

Next Story