ఎంజీ, రెనోల నుంచి కొత్త ఎస్‌యూవీల జాతర

Upcoming SUVs : భారతదేశంలో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం ఉద్దేశించిన 7-సీటర్ కార్లకు ఇప్పుడు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు 2026లో తమ సరికొత్త 7-సీటర్ మోడళ్లను రోడ్లపైకి దించుతున్నాయి. విలాసవంతమైన ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లు, మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లతో రాబోతున్న ఆ 5 అదిరిపోయే కార్ల గురించి తెలుసుకుందాం.

1. ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ ఆర్-లైన్

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఎస్‌యూవీ ఇది. ప్రస్తుతం ఉన్న టిగువాన్ కంటే ఇది పై స్థాయిలో ఉంటుంది. ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 204 హార్స్‌పవర్, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఒక ప్రీమియం త్రీ-రో ఎస్‌యూవీగా మార్కెట్లోకి రానుంది.

2. ఎంజీ మెజెస్టర్

ఎంజీ మోటార్స్ తన గ్లోస్టర్ మోడల్ స్థానంలో ఈ కొత్త మెజెస్టర్ ఎస్‌యూవీని ఫిబ్రవరి 12న లాంచ్ చేయనుంది. ఇది దాదాపు ఒక రాజభవనంలాంటి సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 210 హార్స్‌పవర్, 478 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కారు, ఆఫ్-రోడింగ్ ప్రియులకు ఫేవరెట్‌గా మారుతుంది.

3. నిస్సాన్ 7-సీటర్ ఎస్‌యూవీ

నిస్సాన్ కంపెనీ తన గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ CMF-B ఆధారంగా ఒక సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరలో భారత్‌లోకి తెస్తోంది. ఇప్పటికే టెక్టాన్, గ్రావిటే మోడల్స్ పై పనిచేస్తున్న నిస్సాన్, ఈ పెద్ద ఎస్‌యూవీతో ఫ్యామిలీ సెగ్మెంట్‌లో తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. ఇది అత్యంత సరసమైన ధరలో ప్రీమియం ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

4. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్

భారతీయ రోడ్ల రారాజు స్కార్పియో-ఎన్ ఇప్పుడు కొత్త హంగులతో రాబోతోంది. దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేస్తూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మహీంద్రా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారులో ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లే ఉన్నప్పటికీ, ఇంటీరియర్, టెక్నాలజీ పరంగా మరిన్ని అప్‌డేట్స్ ఉండబోతున్నాయి. కస్టమర్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దీనిని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.

5. రెనాల్ట్ బోరియల్

కొత్త జనరేషన్ డస్టర్ లాంచ్ అయిన వెంటనే, రెనాల్ట్ తన 7-సీటర్ వెర్షన్ బోరియల్‎ను విడుదల చేయనుంది. ఇది డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారవుతున్నప్పటికీ, ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉండి ఏడుగురు సునాయాసంగా కూర్చోవడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో లెవల్ 2 అడాస్, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇది ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story