Hybrid Cars : లీటరు పెట్రోల్‌తో 28కిమీ.. ఆఫీస్ వెళ్లేవారికి ఈ 5 హైబ్రిడ్ కార్లు దేవుడిచ్చిన వరంలాంటివి
ఆఫీస్ వెళ్లేవారికి ఈ 5 హైబ్రిడ్ కార్లు దేవుడిచ్చిన వరంలాంటివి

Hybrid Cars : ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ కారులో ఆఫీసుకి వెళ్లేవారికి నెలవారీ ఫ్యూయల్ ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎలక్ట్రిక్ కార్లు కొందామంటే ఛార్జింగ్ కష్టాలు, లాంగ్ జర్నీలో ఆగిపోతాయేమో అన్న భయం చాలా మందిని వెనక్కి లాగుతోంది. ఇలాంటి సమయంలో హైబ్రిడ్ కార్లు మధ్యేమార్గంగా నిలుస్తున్నాయి. ఆఫీస్ గోయర్స్ కోసం మార్కెట్లో ఉన్న టాప్-5 హైబ్రిడ్ కార్ల వివరాలు చూద్దాం.
మారుతి గ్రాండ్ విటారా
హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒక సంచలనం. ఇది లీటరుకు ఏకంగా 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కారు చాలా వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుంది, దీనివల్ల ఒక్క చుక్క పెట్రోల్ కూడా ఖర్చు కాదు. ఎస్‌యూవీ లుక్ ఇష్టపడే వారికి, భారీ మైలేజ్ కోరుకునే వారికి ఇది మొదటి ఛాయిస్.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
టయోటా కంపెనీకి హైబ్రిడ్ టెక్నాలజీలో దశాబ్దాల అనుభవం ఉంది. వారి నుంచి వచ్చిన హైరైడర్ కూడా లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మారుతి గ్రాండ్ విటారాకు ఇది గట్టి పోటీ ఇస్తోంది. ఈ కారులో డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు ఈ కారు ఇచ్చే కంఫర్ట్, ఫ్యూయల్ ఎకానమీ ఆఫీస్ వెళ్లేవారికి పెద్ద ఊరట. టయోటా సర్వీస్, హైబ్రిడ్ సిస్టమ్ నమ్మదగినవి కావడంతో చాలామంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు.
హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ
మీకు ఎస్‌యూవీల కంటే హుందాతనంగా ఉండే సెడాన్ కార్లంటే ఇష్టమా? అయితే హోండా సిటీ హైబ్రిడ్ మీకు పర్ఫెక్ట్. ఇది లీటరుకు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పాటు ఏడీఏఎస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇంజన్ శబ్దం చాలా తక్కువగా ఉంటుంది, దీనివల్ల లాంగ్ డ్రైవ్ చేసినా అలసట అనిపించదు. లగ్జరీ, మైలేజ్ రెండూ కావాలనుకునే వారికి హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ ఒక అద్భుతమైన ఆప్షన్.
టయోటా ఇన్నోవా హైక్రాస్
సాధారణంగా పెద్ద కార్లు లేదా ఎమ్‌పీవీలు మైలేజ్ తక్కువ ఇస్తాయని అనుకుంటాం. కానీ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. ఇది పెద్ద కారు అయినప్పటికీ లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ప్రీమియం ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, కంఫర్టబుల్ సీట్లతో ఇది ఒక లగ్జరీ సోఫా లాగా ఉంటుంది. ఆఫీస్ పని మీద ఎక్కువ మందితో కలిసి ప్రయాణించాలన్నా లేదా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ట్రిప్పులకు వెళ్లాలన్నా ఇది బెస్ట్.
మారుతి సుజుకి ఇన్విక్టో
ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా తయారైన మారుతి ప్రీమియం కారు ఇన్విక్టో. ఇది కూడా లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మారుతి సుజుకి నెట్‌వర్క్ ద్వారా ప్రీమియం కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. స్పేస్ విషయంలో రాజీ పడకుండా, పెట్రోల్ బిల్లును కంట్రోల్ లో ఉంచుకోవాలనుకునే వారికి ఇన్విక్టో ఒక చక్కని ప్రత్యామ్నాయం. ఈ 5 కార్లలో ఏదో ఒకటి ఎంచుకోవడం ద్వారా మీరు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మీ జేబును కూడా కాపాడుకోవచ్చు.

