Toyota : భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పర్యావరణానికి మేలు చేసే అధునాతన ఇంధన సాంకేతికతతో వస్తున్న టయోటా హైబ్రిడ్ కార్లు భారతీయ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మన దేశంలో కంపెనీ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల మొత్తం విక్రయాలు ఏకంగా 3 లక్షల యూనిట్ల మైలురాయిని దాటినట్లు టయోటా అధికారికంగా ప్రకటించింది. ఈ ఘనత సాధించడంలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ కార్లు అత్యంత కీలక పాత్ర పోషించాయి.

టయోటా తీసుకొచ్చిన ఈ సరికొత్త కార్ల స్పెషాలిటీ ఏంటంటే.. ఇవన్నీ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ కార్లు. అంటే సాధారణ ఎలెక్ట్రిక్ కార్ల లాగా వీటికి బయట ప్లగ్ పెట్టి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. కారు నడుస్తున్నప్పుడు మనం బ్రేక్ వేసినా లేదా పెట్రోల్ ఇంజన్ రన్ అవుతున్నా.. లోపల ఉన్న బ్యాటరీ తనకు తానుగా ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయిపోతుంది. కారు నడిపే వేగం, రోడ్డు పరిస్థితులను బట్టి ఎప్పుడు పెట్రోల్ ఇంజన్ వాడాలి, ఎప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ వాడాలి అనేది కారులోని స్మార్ట్ సిస్టమ్ దానంతట అదే నిర్ణయించుకుంటుంది.

భారత మార్కెట్లో టయోటా ప్రస్తుతం నాలుగు రకాల హైబ్రిడ్ మోడళ్లను అమ్ముతోంది. అందులో ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లతో పాటు ప్రీమియం సెగ్మెంట్‌లో క్యామ్రీ హైబ్రిడ్, వెల్‌ఫైర్ మోడల్స్ ఉన్నాయి. ఈ మొత్తం 3 లక్షల విక్రయాల్లో దాదాపు 80 శాతం మార్కెట్ వాటా కేవలం ఇన్నోవా హైక్రాస్, హైరైడర్లదే కావడం విశేషం. మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో హైరైడర్, 7-సీటర్ లగ్జరీ ఫ్యామిలీ కార్ల విభాగంలో ఇన్నోవా హైక్రాస్ లీడర్లుగా దూసుకుపోతున్నాయి. ఇవి లీటరుకు ఏకంగా 23 కిమీ నుండి 27 కిమీ వరకు అత్యుత్తమ మైలేజ్ ఇస్తూ కస్టమర్ల జేబుకు భారీగా డబ్బులు ఆదా చేస్తున్నాయి.

హైబ్రిడ్ కార్ల టెక్నాలజీ పై కస్టమర్లకు మరింత నమ్మకాన్ని పెంచేందుకు టయోటా కంపెనీ ఈ కార్లలోని బ్యాటరీ ప్యాక్‌పై ఏకంగా 8 సంవత్సరాల సుదీర్ఘ వారంటీని అందిస్తోంది. టయోటా వైస్ ప్రెసిడెంట్ సబరి మనోహర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బందులు లేకుండా ఈజీగా గ్రీన్ మోబిలిటీకి మారడానికి హైబ్రిడ్ టెక్నాలజీ ఒక అద్భుతమైన వంతెనలా పనిచేస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా టయోటా ఇప్పటివరకు 3.8 కోట్లకు పైగా ఇలాంటి పర్యావరణ అనుకూల వాహనాలను విక్రయించి, దాదాపు 197 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story