Toyota Ebella : క్రెటా ఈవీకి నిద్రలేకుండా చేస్తున్న టయోటా ఎబెల్లా..అసలు సిసలు బ్యాటరీ యుద్ధం
అసలు సిసలు బ్యాటరీ యుద్ధం

Toyota Ebella : భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల హవా పెరుగుతున్న వేళ, టయోటా తన ఎబెల్లా ఎస్‌యూవీని రంగంలోకి దించింది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఇప్పటికే మార్కెట్‌లో ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. క్రెటా ఈవీని 2025 జనవరిలో లాంచ్ చేయగా, సరిగ్గా ఏడాది తర్వాత టయోటా తన ఎబెల్లాను తీసుకొచ్చింది. ఈ రెండు కార్ల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి రేంజ్ మరియు బ్యాటరీ సామర్థ్యం. టయోటా ఎబెల్లాలో రెండు బ్యాటరీ ఆప్షన్లు (49 kWh, 61 kWh) ఉన్నాయి. దీని గరిష్ట రేంజ్ ఏకంగా 543 కిలోమీటర్లు. మరోవైపు క్రెటా ఈవీలో కూడా రెండు ఆప్షన్లు ఉన్నప్పటికీ, దాని గరిష్ట రేంజ్ 510 కిలోమీటర్ల వద్ద ఆగిపోతుంది. అంటే లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి ఎబెల్లా కాస్త ఎక్కువ భరోసా ఇస్తుంది.
డిజైన్ విషయానికి వస్తే.. హ్యుందాయ్ క్రెటా ఈవీ చూడటానికి రెగ్యులర్ క్రెటాలానే ఉన్నా, కొన్ని ఎలక్ట్రిక్ హంగులతో ప్రీమియంగా కనిపిస్తుంది. కానీ టయోటా ఎబెల్లాను ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. దీని హ్యామర్ హెడ్ ఫ్రంట్ డిజైన్, స్లీక్ ఎల్‌ఈడీ లైట్లు కారుకు ఒక ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి. లోపల స్పేస్ విషయంలో కూడా ఎబెల్లా కాస్త ముందుంటుంది. ఎందుకంటే దీని వీల్‌బేస్ 2700mm, ఇది క్రెటా (2610mm) కంటే ఎక్కువ. దీనివల్ల లోపల కూర్చునే వారికి కాలు చాపుకోవడానికి ఎక్కువ స్థలం దొరుకుతుంది.
ఫీచర్ల పరంగా రెండు కార్లు ఒకదానికొకటి పోటీ ఇస్తున్నాయి. ఎబెల్లాలో 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంట్లేటెడ్ సీట్లు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఈవీలో కూడా డ్యూయల్ స్క్రీన్ సెటప్, V2L (Vehicle-to-Load) ఫీచర్ వంటి అడ్వాన్సుడ్ సౌకర్యాలు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో టయోటా ఒక అడుగు ముందుకేసి 7 ఎయిర్ బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. లెవల్-2 ADAS ఫీచర్లు ఇరు కార్లలోనూ కామన్‌గా ఉన్నాయి.
నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న బ్రాండ్ కావాలంటే క్రెటా ఈవీ బెస్ట్. అలా కాకుండా కొత్త డిజైన్, ఎక్కువ రేంజ్, టయోటా క్వాలిటీ కావాలనుకుంటే ఎబెల్లా సరైన ఛాయిస్. ఎబెల్లా బుకింగ్స్ రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలో దీని ధరలను అధికారికంగా ప్రకటించనున్నారు.

