Toyota Fortuner : భారతదేశంలో ఎస్‌యూవీ ప్రేమికులకు అత్యంత ఇష్టమైన మోడల్ టయోటా ఫార్చ్యూనర్. అయితే, ఇప్పుడు ఈ కారు కొనాలనుకునే వారికి కంపెనీ ఒక చేదు వార్త చెప్పింది. ఫార్చ్యూనర్ ధరలను భారీగా పెంచుతూ టోయోటా నిర్ణయం తీసుకుంది. వేరియంట్‌ను బట్టి ఈ పెంపు రూ.60,000 నుంచి రూ. 87,000 వరకు ఉంది. దీంతో ఫార్చ్యూనర్ ప్రియుల జేబుకు గట్టిగానే చిల్లు పడనుంది. టయోటా ఫార్చ్యూనర్ ధరలు పెరగడంతో ఇప్పుడు ఈ ఎస్‌యూవీ రూ. 34.76 లక్షల నుంచి రూ. 50.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తోంది. ముఖ్యంగా టాప్ ఎండ్ మోడల్ అయిన GR-S 4X4 AT వేరియంట్‌పై గరిష్టంగా రూ.87,000 పెంచారు. ఫార్చ్యూనర్‌లో క్రేజీ మోడల్ అయిన లెజెండర్ వేరియంట్లు కూడా ఖరీదైనవిగా మారాయి. లెజెండర్ 4X2 పై రూ. 75,000, 4X4 MT పై రూ. 78,000, 4X4 AT పై రూ. 83,000 వరకు పెంపును వర్తింపజేశారు.

ఎంట్రీ లెవల్ పెట్రోల్ 4X2 AT మోడల్ ఇప్పుడు రూ.60,000 ప్రియం కాగా, డీజిల్ వేరియంట్లలో కూడా భారీ మార్పులే ఉన్నాయి. 4X2 MT డీజిల్, 4X2 AT డీజిల్ మరియు 4X4 MT డీజిల్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.60,000, రూ.65,000, రూ.67,000 పెరిగాయి. అలాగే పర్యావరణ హితంగా ఉండే డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ 4X4 AT వేరియంట్ ధర కూడా రూ.75,000 పెరిగింది.

ధరల పెంపు ఒక ఎత్తు అయితే, కొత్త మోడల్ రాబోతుందనే వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. 2026 చివరి నాటికి సరికొత్త నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఆ తర్వాత భారత్‌లో కూడా ఇది అడుగుపెట్టనుంది. ఈ కొత్త మోడల్‌లో సెక్యూరిటీ కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) రాబోతోంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన ఫోటోల ప్రకారం, బంపర్ కింద రాడార్ మాడ్యూల్, విండ్‌స్క్రీన్ వెనుక కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు.

కొత్త ఫార్చ్యూనర్‌లో మరిన్ని హైటెక్ ఫీచర్లు ఉండబోతున్నాయి. 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటివి ప్రధాన ఆకర్షణలు. అలాగే ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్స్, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, 166 bhp పవర్ ఇచ్చే 2.7 లీటర్ పెట్రోల్, 204 bhp పవర్ ఇచ్చే 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతాయి. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ రాబోతుండటం విశేషం.

PolitEnt Media

PolitEnt Media

Next Story