రోడ్లపై ఇక దీనిదే రాజసం

MG Majestor : భారతదేశంలో టయోటా ఫార్చ్యూనర్ అంటే అదొక పవర్ సింబల్. కానీ, ఇప్పుడు ఆ సామ్రాజ్యానికి సవాల్ విసిరేలా రెండు సరికొత్త భారీ ఎస్‌యూవీలు (SUVs) మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అటు ఎంజీ మోటార్స్, ఇటు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ తమ ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయి. ఏప్రిల్ 20న ఒక భారీ లాంచ్ ఉండగా.. మరోవైపు 1000 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కారు సిద్ధమవుతోంది. ఎంజీ మోటార్ ఇండియా తన గ్లోస్టర్ మోడల్‌ను భారీగా అప్‌డేట్ చేసి మెజెస్టర్ పేరుతో ఏప్రిల్ 20, 2026న లాంచ్ చేయబోతోంది. ఇది చూడటానికి ఫార్చ్యూనర్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉండి రోడ్డుపై ఒక గంభీరమైన రూపాన్ని ఇస్తుంది. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 215 hp పవర్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో లెవల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, మసాజ్ ఫంక్షన్ ఉన్న వెన్టిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి. అంటే ఆఫ్-రోడింగ్‌తో పాటు విమానం లాంటి సౌకర్యం కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

జెఎస్‌డబ్ల్యూ జెటూర్ టీ2

జెఎస్‌డబ్ల్యూ గ్రూప్, చైనాకు చెందిన చెర్రీ భాగస్వామ్యంలో వస్తున్న జెటూర్ టీ2 ఎస్‌యూవీ మార్కెట్లో సంచలనం సృష్టించబోతోంది. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీతో వస్తోంది. అంటే ఇందులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ రెండింటి కలయికతో ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసి, బ్యాటరీ ఫుల్ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీని లుక్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాగా చాలా మొరటుగా, బాక్సీ డిజైన్ తో ఉంటుంది. ఇందులో 15.6 అంగుళాల అతిపెద్ద స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి హైటెక్ ఫీచర్లు ఉండబోతున్నాయి.

పోటీ ఎలా ఉండబోతోంది?

ఫార్చ్యూనర్ తన మన్నికకు , రీసేల్ వాల్యూకు పేరుగాంచినప్పటికీ, మెజెస్టర్, టీ2లు ఫీచర్లు, సౌకర్యం, మైలేజీలో టయోటా కంటే చాలా ముందున్నాయి. మెజెస్టర్ ధర సుమారు రూ. 40 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జెటూర్ టీ2 కూడా ఇదే రేంజ్ లో లేదా కొంచెం తక్కువకే వచ్చే అవకాశం ఉంది. హైవేలపై రారాజులా వెళ్లాలనుకునే వారు మెజెస్టర్ వైపు, టెక్నాలజీ, భారీ మైలేజీ కోరుకునే వారు జెటూర్ టీ2 వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story