Toyota Glanza: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మారూతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ వర్షన్ రూ.6.90 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన తర్వాత, ఇప్పుడు టయోటా గ్లాంజా వంతు వచ్చింది. అక్టోబర్ 2026 నాటికి సరికొత్త హంగులతో టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ కార్ రోడ్లపైకి రానున్నట్లు తెలుస్తోంది. టయోటా గ్లాంజా మొదటి నుంచి బాలెనో మోడల్ ఆధారంగా వస్తున్నప్పటికీ, తనదైన ప్రత్యేక డిజైన్ శైలితో ఆకట్టుకుంటోంది. 2026 బాలెనోలో పెద్ద ఫ్రంట్ గ్రిల్, మూడు క్రోమ్ పట్టీలు, బోనెట్ వైపు మారిన లోగో వంటి మార్పులు చేశారు. గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ఈ తరహా అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. టయోటా తన సొంత బ్రాండ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ముందు భాగాన్ని మరింత స్పోర్టీగా తీర్చిదిద్దనుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, టర్న్ ఇండికేటర్లతో కూడిన హెడ్‌ల్యాంప్స్, 16 ఇంచుల అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్స్ వంటి అంశాలు వాహనానికి ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.

సెగ్మెంట్లోనే అత్యుత్తమ సేఫ్టీ

కొత్త గ్లాంజాలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఫీచర్ల అప్‌గ్రేడ్. ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ అందించనున్నట్లు సమాచారం. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్ వంటి కీలక భద్రతా ఫీచర్లు దీని సొంతం కానున్నాయి. ఏడాస్ వ్యవస్థను డ్రైవర్లు తమ సౌకర్యాన్ని బట్టి ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడానికి వీలుగా ఫిజికల్ బటన్‌ను కూడా టయోటా ఏర్పాటు చేయనుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ వ్యవస్థ ప్రమాదాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తాయి.

కార్పొరేట్ స్థాయిలో సౌకర్యవంతమైన ఫీచర్లు

కారు లోపల ప్రయాణికుల కంఫర్ట్ కోసం భారీ మార్పులు చేస్తున్నారు. మొదటిసారిగా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను ప్రవేశపెడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కలిగించే యువీ కట్ గ్లాస్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 9 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్‌ప్లే (HUD), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అత్యాధునిక హంగులు అమర్చనున్నారు. 360 డిగ్రీల కెమెరా వల్ల ఇరుకైన ప్రాంతాల్లో కారును పార్కింగ్ చేయడం చాలా సులువవుతుంది.

జెడ్12ఈ కొత్త ఇంజిన్

ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో స్విఫ్ట్ కారులో వాడే నూతన 1.2 లీటర్, 3 సిలిండర్ జెడ్12ఈ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజిన్ 81 బిహెచ్‌పి పవర్, 112 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిని మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో తీసుకురానున్నారు. భవిష్యత్తులో సీఎన్‌జీ మోడల్‌తో పాటు ఏఎమ్‌టీ కాంబినేషన్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది.

Next Story