Toyota Glanza: బాలెనోకు గట్టి పోటీ.. రూ.6.99 లక్షల ప్రారంభ ధరతో కొత్త టయోటా గ్లాంజా లాంచ్
కొత్త టయోటా గ్లాంజా లాంచ్

Toyota Glanza: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పండుగ సీజన్ జోరు కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా వినియోగదారులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన మైలేజ్, అత్యాధునిక భద్రతా ఫీచర్లతో వస్తున్న ఈ కారు ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
కొత్త టయోటా గ్లాంజా ఎక్స్ షోరూమ్ ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.10.49 లక్షల మధ్య డిసైడ్ చేశారు. ఈ కారును మొత్తం ఐదు వేరియంట్లలో (E, S, G, V, V (O)) మార్కెట్లోకి తీసుకువచ్చారు. మారుతి సుజుకి బాలెనోతో తన ప్లాట్‌ఫారమ్‌ను పంచుకునే ఈ కారు హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఈ కొత్త మోడల్లో అత్యంత ముఖ్యమైన మార్పు ఇంజిన్ పరంగా జరిగింది. ఇందులో పాత 4-సిలిండర్ ఇంజిన్‌కు బదులుగా సరికొత్త 1.2 లీటర్ Z12E, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది పెట్రోల్ మోడ్‌లో 83 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మెరుగైన మైలేజ్ అందించేందుకు ఇందులో ఐడల్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ కూడా ఉంది. సీఎన్జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 70 bhp పవర్, 102 Nm టార్క్ ఇస్తుంది.
కారు ఎక్స్ టీరియర్లో కొన్ని అధునాతన మార్పులు చేశారు. ముందు భాగంలో పెద్ద గ్రిల్, సాటిన్ ఫినిషింగ్ డిటైలింగ్, సరికొత్త ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. టయోటా లోగోను బోనెట్ కింద అమర్చగా, ఏడీఏఎస్ (ADAS) కోసం ప్రత్యేకంగా రాడార్ మాడ్యూల్ జోడించారు. డిజిటల్ టీల్ గ్రీన్, బ్లూయిష్ బ్లాక్ అనే రెండు కొత్త రంగులతో పాటు షార్క్-ఫిన్ యాంటెన్నా, 16-అంగుళాల అలాయ్ వీల్స్ ఈ కారుకు మరింత స్టైలిష్ లుక్ తెచ్చిపెట్టాయి.
కరిలోని కేబిన్ అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, క్లారియన్ ఆడియో సిస్టమ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో లెవెల్-2 ADAS, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇచ్చారు. ప్రయాణికుల సేఫ్టీ కోసం అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి.

