Toyota Hyryder : క్రెటాకి దడ పుట్టిస్తున్న ఈ కారు.. మూడు ఏళ్లలో 1.6 లక్షలు సేల్
మూడు ఏళ్లలో 1.6 లక్షలు సేల్

Toyota Hyryder : భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇస్తున్న టొయోటా హైరైడర్ కారు అమ్మకాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా దాని అద్భుతమైన మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ 2022లో భారతదేశంలో తమ మొదటి మీడియం రేంజ్ ఎస్‌యూవీ అయిన హైరైడర్‌ను లాంచ్ చేసింది. అప్పటి నుండి ఈ కారు అమ్మకాలు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు నెలలో 9,100 యూనిట్ల అమ్మకాలతో ఈ కారు తన సత్తా చాటింది. మారుతి గ్రాండ్ విటారాకు రీ-బ్యాడ్జ్డ్ వెర్షన్ అయిన ఈ కారు మార్కెట్‌లో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆగస్టు 2025 నాటికి హైరైడర్ మొత్తం 1,60,634 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.
ఈ కారు అమ్మకాల స్పీడు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. మొదటి 50,000 యూనిట్లు అమ్ముడవడానికి దాదాపు 15 నెలలు పడితే, ఆ తర్వాత 50,000 యూనిట్లు కేవలం 11 నెలల్లోనే అమ్ముడయ్యాయి. ఈ స్పీడుతోనే లక్ష యూనిట్ల మార్కును దాటింది. ఇక జూన్ 2025 నాటికి 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత కేవలం 10 నెలల్లోనే మరో 60,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది టయోటా హైరైడర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది. టయోటా ఇండియా మొత్తం ప్యాసింజర్ వెహికల్ అమ్మకాల్లో ఈ కారు వాటా పెరుగుతోంది.
టయోటా హైరైడర్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల క్యాబిన్ ఎర్గోనామిక్ డిజైన్‌తో, అనేక ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో విశాలమైన, సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద ఇంటీరియర్ స్పేస్ ఉన్నాయి. ఈ కారు పెట్రోల్, ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండూ అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ మైలేజ్‌ను అందిస్తాయి. టయోటా హైరైడర్ ధర రూ. 12.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ. 20.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారు మొత్తం 18 వేరియంట్లలో లభిస్తుంది.
టయోటా హైరైడర్ మైలేజ్ దాని హైబ్రిడ్ వెర్షన్‌కు ప్రధాన బలం. ఏఆర్ఏఐ (ARAI) ప్రకారం, ఈ కారు మైలేజ్ లీటరుకు 19.39 కి.మీ నుండి 27.97 కి.మీ వరకు ఉంటుంది. హైబ్రిడ్ వెర్షన్ అయితే లీటరుకు 27.97 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. సీఎన్‌జీ (CNG) వెర్షన్ సుమారు కిలోకు 26.6 కి.మీ మైలేజ్ ఇస్తుంది. స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్‌లు ట్రాన్స్‌మిషన్‌ను బట్టి లీటరుకు 19.20 నుండి 21.12 కి.మీ వరకు మైలేజ్ ఇస్తాయి.
ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 9 అంగుళాల స్మార్ట్‌ప్లే కాస్ట్ టచ్‌స్క్రీన్ (యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో), వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, టయోటా ఐ-కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు ఆర్టిఫిషియల్ లెదర్ అప్‌హోల్‌స్ట్రీతో వెంటిలేటెడ్ సీట్లు, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, యాంబియెంట్ లైటింగ్ వంటివి కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) నుండి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
