Toyota Hyryder : లీటరు పెట్రోల్ కి 28 కిలోమీటర్లు..2 లక్షల ఇళ్లకు చేరిన మైలేజ్ కింగ్
2 లక్షల ఇళ్లకు చేరిన మైలేజ్ కింగ్

Toyota Hyryder : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్. మిడ్-సైజ్ ఎస్‍యూవీ విభాగంలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ కారు భారత్‌లో 2 లక్షల అమ్మకాల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. హ్యుందాయ్ క్రెటా వంటి హేమాహేమీలకు గట్టి పోటీ ఇస్తూ, మధ్యతరగతి, సంపన్న వర్గాల ఫేవరెట్ కారుగా మారిపోయింది.
టయోటా హైరైడర్ 2022 సెప్టెంబర్‌లో లాంచ్ అయినప్పటి నుంచి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. కేవలం 40 నెలల్లోనే 2 లక్షల మంది కస్టమర్ల మనసు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా 2025 క్యాలెండర్ ఇయర్లో ఈ కారు అమ్మకాలు మునుపటి ఏడాది కంటే ఏకంగా 36 శాతం పెరిగాయి. మొదటి 50 వేల కార్లు అమ్ముడవడానికి 15 నెలలు పట్టగా, చివరి లక్ష యూనిట్లు మాత్రం కేవలం 15 నెలల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీన్నిబట్టే ఈ కారుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ కారు ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ. టయోటా హైరైడర్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అంటే దాదాపు ఒక చిన్న బైక్ ఇచ్చే మైలేజీని ఒక భారీ ఎస్‍యూవీ ఇస్తోందన్నమాట. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇంతటి మైలేజ్ సామాన్యుడికి పెద్ద వరం. లో-స్పీడ్‌లో ఇది బ్యాటరీ మోడ్‌లో నడుస్తుంది. దీనివల్ల కారు లోపల ఎలాంటి శబ్దం లేకుండా చాలా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.
టయోటా హైరైడర్ కేవలం మైలేజ్ మాత్రమే కాదు, లుక్స్ పరంగా కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ రోడ్డు మీద రాజసం ఉట్టిపడేలా చేస్తాయి. కారు లోపల పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఢిల్లీలో దీని బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ.12.73 లక్షల నుండి ప్రారంభమై, టాప్ ఎండ్ వెర్షన్ రూ.22.75 లక్షల వరకు ఉంటుంది. మొత్తం 25 వేరియంట్లలో లభిస్తుండటం వల్ల కస్టమర్లకు తమ బడ్జెట్ కు తగ్గట్టుగా ఎంచుకునే అవకాశం ఉంది.

