ఏకంగా 3.88 లక్షల కార్లు విక్రయం!

Toyota : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో టయోటా ప్రభంజనం సృష్టిస్తోంది. 2025 ఏడాదిని టయోటా కిర్లోస్కర్ మోటార్ తన చరిత్రలోనే గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. ఎన్నడూ లేని విధంగా అత్యధిక విక్రయాలను నమోదు చేస్తూ పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఈ ఏడాది మొత్తం 3.88 లక్షల మంది కస్టమర్లు టయోటా కార్లను తమ ఇంటికి తీసుకెళ్లారు. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 19 శాతం వృద్ధిని సాధించి, మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.

సాధారణంగా ఏడాది చివరలో కార్ల అమ్మకాలు తగ్గుతాయని అంటారు, కానీ టయోటా విషయంలో అది తప్పని నిరూపితమైంది. ఒక్క డిసెంబర్ 2025 నెలలోనే కంపెనీ 39,333 యూనిట్లను విక్రయించింది. 2024 డిసెంబర్ తో పోలిస్తే ఇది 33 శాతం పెరుగుదల. ఇందులో దేశీయ మార్కెట్లోనే 34,157 కార్లు అమ్ముడవ్వగా, మరో 5,176 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. కస్టమర్ల నుంచి వస్తున్న ఈ భారీ స్పందన చూసి ఆటోమొబైల్ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

టయోటా కార్ల మీద కస్టమర్లకు అంత నమ్మకం కలగడానికి ప్రధాన కారణం భద్రత. కంపెనీ తన కార్లలో సేఫ్టీ ఫీచర్లను భారీగా పెంచింది. ముఖ్యంగా రూమియన్, గ్లాంజా, అర్బన్ క్రూజర్ టైజర్, హైరైడర్ వంటి అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా (అన్ని వేరియంట్లలోనూ) అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు, కస్టమర్ల ఫేవరెట్ ఇన్నోవా హైక్రాస్ భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించడం కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడల్‌లో టయోటా కీలక మార్పులు చేసింది. దీని AWD వేరియంట్‌లో సరికొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రవేశపెట్టగా, నియో డ్రైవ్ మోడల్‌లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి లగ్జరీ ఫీచర్లను జోడించింది. దీనివల్ల డ్రైవింగ్ అనుభవం మరింత సులభంగా మరియు సౌకర్యవంతంగా మారింది. ఇన్నోవా, ఫార్చ్యూనర్ తో పాటు గ్లాంజా, హైరైడర్ వంటి చిన్న ఎస్‌యూవీలు కూడా అమ్మకాల్లో పోటీ పడుతున్నాయి.

టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రతినిధులు మాట్లాడుతూ.. 2025 లో సాధించిన విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, 2026 లో మరిన్ని కొత్త మోడళ్లు మరియు మెరుగైన సర్వీస్ నెట్‌వర్క్‌తో కస్టమర్ల ముందుకు వస్తామని తెలిపారు. క్వాలిటీ, నమ్మకం, సేఫ్టీ - ఈ మూడే టయోటా సక్సెస్ మంత్రాలు. పాత రికార్డులను తిరగరాసిన టయోటా, రాబోయే రోజుల్లో భారత్‌లో మరిన్ని వింతలు చేయడానికి సిద్ధమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story