ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్‌లో ఇక దీనిదే రాజ్యం

Toyota Innova Hycross : భారతదేశంలో ఫ్యామిలీ కార్ల విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ త్వరలోనే సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. 2022లో తొలిసారి లాంచ్ అయిన ఈ కారు, తన అద్భుతమైన స్పేస్, హైబ్రిడ్ టెక్నాలజీ, టయోటా బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో వినియోగదారుల మనసు గెలుచుకుంది. ఇప్పుడు మరింత ఆధునిక ఫీచర్లతో దీనికి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం..టయోటా ఈ ఎమ్‌పీవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ, ఇప్పటికే ఉన్న మోడల్‌ను మరింత అప్‌డేట్ చేసి అమ్మకాలను పెంచుకోవాలని టొయోటా భావిస్తోంది.

డిజైన్‌లో మార్పులు.. ఫీచర్లలో అప్‌గ్రేడ్

కొత్త ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండకపోవచ్చు కానీ, చిన్న చిన్న అప్‌డేట్స్ మాత్రం కచ్చితంగా కనిపిస్తాయి. ముందు భాగంలో కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ లైట్లు, కారు ఎక్స్‌టీరియర్‌లో చిన్నపాటి మెరుగులు దిద్దనున్నారు. లోపల మాత్రం డ్రైవింగ్ అనుభవాన్ని మార్చేలా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించే అవకాశం ఉంది.

అవే ఫీచర్లు.. అదే భరోసా

ప్రస్తుతం ఉన్న లగ్జరీ ఫీచర్లను కంపెనీ అలాగే కొనసాగించనుంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెదర్ సీటింగ్, 9-స్పీకర్ల జెబిఎల్ (JBL) సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా వంటివి ఇందులో ఉండబోతున్నాయి. సేఫ్టీ విషయంలోనూ రాజీ పడకుండా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్-2 ఏడీఏఎస్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఈ కారులో లభించనున్నాయి.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్

ఇంజిన్ విషయంలో టొయోటా ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 172 bhp పవర్‌ను ఇస్తూ సీవీటీ (CVT) గేర్‌బాక్స్‌తో వస్తుంది. అదే హైబ్రిడ్ వెర్షన్ అయితే 184 bhp పవర్‌ను ఇస్తూ ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో మెరుగైన మైలేజీని అందిస్తుంది.

ధర మరియు పోటీ

ప్రస్తుత మోడల్ ధర రూ.18.33 లక్షల నుంచి రూ.31.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరలు దీనికంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది కియా కార్నివాల్, మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది. టెక్నాలజీ పరంగా మరిన్ని మెరుగులు దిద్దడం వల్ల ఫ్యామిలీ కార్ల విభాగంలో ఇన్నోవా తన అగ్రస్థానాన్ని కాపాడుకునేలా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story