Toyota : భారతదేశంలో లగ్జరీ, ఫ్యామిలీ ఎమ్‌పీవీ కార్ల విభాగంలో తిరుగులేని చక్రవర్తిగా దూసుకుపోతున్న మోడల్ టయోటా ఇన్నోవా హైక్రాస్. ఇప్పుడీ సూపర్ హిట్ కారుకు సంబంధించి వాహన ప్రియులను హుషారెత్తించే ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. టయోటా కంపెనీ తన ఇన్నోవా హైక్రాస్‌ను భారీ మార్పులతో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో ఈ కారుకు సంబంధించిన సరికొత్త మోడల్ ఒకటి పూర్తిగా కవర్‌తో భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ 2027 ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను టెస్ట్ చేస్తోందని స్పష్టమవుతోంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే, హైక్రాస్ సిరీస్‌లో వస్తున్న మొట్టమొదటి అతిపెద్ద మేజర్ అప్‌డేట్ ఇదే కావడం విశేషం.

నవంబర్ 2022 నాటి మోడల్‌కు బిగ్ అప్‌డేట్

టయోటా సంస్థ తన ఇన్నోవా హైక్రాస్‌ను మొదటిసారిగా నవంబర్ 2022లో ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 2022లో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కారు విక్రయాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. కారు మార్కెట్లోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుండటంతో, మారుతున్న కాలం, టెక్నాలజీకి అనుగుణంగా 2027లో దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయడం కరెక్ట్ టైమింగ్ అని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సరికొత్త లుక్‌తో రానున్న ఇన్నోవా

వివిధ ఆటోమొబైల్ మీడియా నివేదికల ప్రకారం.. టయోటా ఈసారి కేవలం పైపైన చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులు చేయడం లేదు, కారు లుక్‌ను పూర్తిగా మార్చేలా డిజైన్ అప్‌డేట్స్ చేస్తోంది. టెస్టింగ్ సమయంలో కారు ముందు భాగం పూర్తిగా కవర్ చేయబడి ఉంది. దీనిని బట్టి చూస్తే కారుకు సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టైలిష్ బంపర్, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల సెటప్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్ డిజైన్ ఇప్పటికే చాలా బోల్డ్‌గా, ఎస్‌యూవీ లుక్‌తో ఉన్నప్పటికీ.. కొత్త మోడల్‌ను మరింత గంభీరంగా, ఆకర్షణీయంగా మార్చనున్నారు. కారు ప్రధాన బాడీ స్ట్రక్చర్ లేదా ప్లాట్‌ఫారమ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు కానీ, కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, వెనుక వైపు సరికొత్త టెయిల్ లైట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌లో అదిరిపోయే లగ్జరీ

కొత్త ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ కారు ఇంటీరియర్ ప్రస్తుత మోడల్ కంటే చాలా రేట్లు ప్రీమియంగా మారబోతోంది. దీని డ్యాష్‌బోర్డ్‌కు సరికొత్త ఫినిషింగ్ ఇవ్వడంతో పాటు, ప్రీమియం క్వాలిటీతో కూడిన సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, కొత్త కలర్ థీమ్ గల సీట్ అప్హోల్‌స్టరీని వాడనున్నారు. ఫీచర్ల పరంగా చూస్తే.. ఇందులో మరింత పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌గ్రేడెడ్ సాఫ్ట్‌వేర్, మెరుగైన వ్యూ ఇచ్చే 360-డిగ్రీల కెమెరా, సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటివి ఉంటాయి. వీటితో పాటు అదిరిపోయే సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టమ్, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, టాప్ వేరియంట్లలో సెకండ్ రో ప్రయాణీకుల కోసం వెంటిలేటెడ్ కెప్టెన్ సీట్లను కూడా జోడించవచ్చని సమాచారం.

మరింత పటిష్టమైన అడ్వాన్స్‌డ్ ADAS భద్రత

కస్టమర్ల రక్షణ విషయంలో టయోటా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో మునుపటి కంటే మరింత అడ్వాన్స్‌డ్ లెవెల్ అడాస్ ఫీచర్లను జోడించబోతున్నారు. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నమ్మకమైన ఇంజన్ ఆప్షన్లనే కంపెనీ కొనసాగించనుంది. ఇందులో 2.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, సూపర్ మైలేజ్ ఇచ్చే 2.0-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఉంటాయి. అయితే, ఈ కారులో రాబోయే అతిపెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్. టయోటా సంస్థ ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో నడిచే ఇన్నోవా హైక్రాస్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. కాబట్టి ఈ 2027 ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌తో పాటే పర్యావరణహితమైన, ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను కూడా అధికారికంగా మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story