రోడ్డు మీద కనిపిస్తే ఇన్నోవా, లేదంటే ఫార్చ్యూనర్లే

Toyota : భారత ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ, భరోసాకు మారుపేరుగా నిలిచిన టయోటా కిర్లోస్కర్ మోటార్, 2026 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లతో మార్కెట్‌ను ఏలుతున్న ఈ జపాన్ కంపెనీ, బుధవారం తన వార్షిక విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేస్తూ, భారతీయ కస్టమర్ల మనసులో తనకున్న తిరుగులేని స్థానాన్ని మరోసారి నిరూపించుకుంది.

టయోటా కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,06,081 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది FY25 అమ్మకాలతో (3,09,508 యూనిట్లు) పోలిస్తే ఏకంగా 20 శాతం వృద్ధి. ఇందులో ఎగుమతులు కూడా కలిసి ఉన్నాయి. కేవలం భారతీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా టయోటా కార్లకు డిమాండ్ పెరగడం విశేషం. ఇక దేశీయంగా చూసుకుంటే.. అమ్మకాలు 19 శాతం పెరిగి 3,67,107 యూనిట్లకు చేరుకున్నాయి. కేవలం మార్చి 2026 ఒక్క నెలలోనే 35,125 కార్లు అమ్ముడయ్యాయి, అంటే క్రితం ఏడాది మార్చి కంటే ఇది 24 శాతం ఎక్కువ.

ప్రస్తుతం ఆటోమొబైల్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. భారతీయ వినియోగదారులు ఎక్కువగా పెద్ద కార్ల వైపు, ముఖ్యంగా ఎస్‌యూవీ, ఎంపీవీ మోడళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. టయోటా పోర్ట్‌ఫోలియోలో ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, ఫార్చ్యూనర్ వంటి వాహనాలు ఈ విభాగాల్లో రారాజులుగా ఉన్నాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సబరి మనోహర్ మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లు, యువతను ఆకర్షించే డిజైన్ల వల్ల టయోటా ఒక స్టైలిష్ బ్రాండ్‌గా మారిందని, అందుకే కస్టమర్లు తమ కార్లను ఎంచుకుంటున్నారని తెలిపారు.

ఎందుకు ఇంత డిమాండ్?

టయోటా కార్లంటేనే నమ్మకం, రీసేల్ వాల్యూకు కేరాఫ్ అడ్రస్. కేవలం ఇంజిన్ పవర్ మాత్రమే కాకుండా, మెరుగైన మైలేజీ, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల ఇంధన ఖర్చులు తగ్గడం కూడా మరో ప్లస్ పాయింట్ అయ్యింది. ఫ్యామిలీ ట్రిప్పులకు ఇన్నోవా, ఆఫ్‌రోడింగ్, దర్జా కోసం ఫార్చ్యూనర్ కార్లు ఏళ్ల తరబడి విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. రాబోయే కాలంలో కూడా ఇదే జోరును కొనసాగించేందుకు కంపెనీ మరిన్ని కొత్త మోడళ్లను, ఎలక్ట్రిక్ వెర్షన్లను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story