బడ్జెట్ రేంజ్ లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే రచ్చ

Toyota Land Cruiser FJ : ప్రపంచవ్యాప్తంగా ఆఫ్-రోడ్ వాహనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టయోటా ల్యాండ్ క్రూయిజర్ బ్రాండ్ నుంచి మరో సంచలన మోడల్ వచ్చేసింది. జపనీస్ కార్ల దిగ్గజం టయోటా, తన మోస్ట్ అవైటెడ్ ఎస్‌యూవీ ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జేను తాజాగా థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. గతేడాది జపాన్ ఆటో షోలో కాన్సెప్ట్ రూపంలో మెరిసిన ఈ కారు, ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌తో రోడ్లపైకి వచ్చేసింది. ల్యాండ్ క్రూయిజర్ అంటే కేవలం కోటీశ్వరులకే కాదు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో టయోటా ఈ బడ్జెట్ ఎస్‌యూవీని రూపొందించింది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనందరికీ తెలిసిన టయోటా ఫార్చ్యూనర్ ఆధారపడిన IMV ప్లాట్‌ఫామ్‌ పైనే రూపొందించబడింది. అయితే, సైజు పరంగా ఇది ఫార్చ్యూనర్ కంటే కొంచెం చిన్నది. ఫార్చ్యూనర్ కంటే దీని పొడవు 185 mm తక్కువ, వీల్‌బేస్ 170 mm చిన్నది. దీనివల్ల ఇరుకైన సందుల్లో లేదా కఠినమైన ఆఫ్-రోడ్ దారిలో కారును తిప్పడం చాలా సులభం అవుతుంది. చిన్న సైజులో ఉన్నా, ల్యాండ్ క్రూయిజర్ బ్రాండ్‌కు ఉండే ఆ గంభీరమైన లుక్ ఏమాత్రం తగ్గకుండా టయోటా జాగ్రత్త పడింది.

ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే డిజైన్ పాత కాలపు క్లాసిక్ లుక్, నేటి తరం మోడ్రన్ ఫీచర్ల కలయికగా ఉంది. దీనికి సి-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‎తో కూడిన గుండ్రని హెడ్‌లైట్లు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తాయి. ముందు వైపు పెద్ద TOYOTA లోగోతో కూడిన గ్రిల్, కింద స్ట్రాంగ్ క్లాడింగ్ దీనిని పెద్ద ల్యాండ్ క్రూయిజర్ (LC300) కుటుంబ సభ్యుడిలా చూపిస్తాయి. కారు వెనుక భాగంలో స్పేర్ వీల్ ఉండటం దీనికి పక్కా ఆఫ్-రోడర్ ఇమేజ్‌ని ఇస్తుంది. బ్లాక్ కలర్ ఓఆర్‌వీఎంలు, డోర్ హ్యాండిల్స్ దీనికి స్పోర్టీ లుక్ జోడించాయి.

సామర్థ్యం విషయంలో టయోటా ఎక్కడా తగ్గలేదు. ఇందులో 2.7-లీటర్ 4-సిలిండర్ 2TR ఇంజిన్ అమర్చారు. ఇది 163 hp పవర్, 246 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఈ ఎస్‌యూవీలో అత్యంత కీలకమైన 4-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్ ఉంది. దీనివల్ల బురద గుంతలు, ఇసుక తిన్నెలు లేదా రాళ్ల దారుల్లో కూడా ఈ కారు అలవోకగా దూసుకుపోతుంది. తక్కువ బరువు, పవర్ఫుల్ ఇంజిన్ కలయికతో ఇది అద్భుతమైన ఆఫ్-రోడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

భారత్‌కు ఎప్పుడు వస్తుంది? ధర ఎంత?

థాయ్‌లాండ్‌లో దీని ధర సుమారు రూ.37.26 లక్షలు (12.89 లక్షల థాయ్ బాట్) గా ఉంది. అయితే, భారత్‌లో ఈ కారును టయోటా తన ఛత్రపతి శంభాజీనగర్ ప్లాంట్‌లో లోకల్ గా తయారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ తయారైతే, దీని ధర సుమారు రూ.30 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది. నివేదికల ప్రకారం, 2028 నాటికి ఇది భారత మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చు. భారత్‌లో ఇది లాంచ్ అయితే, జీప్ కంపాస్ (4x4), ఇసుజు MU-X, మహీంద్రా స్కార్పియో-ఎన్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది. ల్యాండ్ క్రూయిజర్ కొనాలని ఆశపడి, బడ్జెట్ సరిపోని వారికి ఎఫ్‌జే ఒక వరం లాంటిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story