Toyota : మహారాష్ట్రలో టయోటా భారీ ఫ్యాక్టరీ.. ఏటా లక్ష కార్ల ఉత్పత్తి.. వేలల్లో ఉద్యోగాలు
ఏటా లక్ష కార్ల ఉత్పత్తి.. వేలల్లో ఉద్యోగాలు

Toyota : ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించబోతోంది. మహారాష్ట్ర వేదికగా సరికొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా కేవలం కార్ల ఉత్పత్తే కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బిగించేందుకు టయోటా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. టయోటా తన కొత్త ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలోని బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్మించనుంది. ఈ ప్లాంట్ ఏటా లక్ష వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2029 మొదటి సగభాగం నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావచ్చని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్టాంపింగ్, వెల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లీ వంటి అన్ని కీలక పనులు ఇక్కడే జరగనున్నాయి.
టయోటా ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ లాంచ్‌కు సమయం దగ్గర పడింది. ఈ ఏడాది చివరిలో లేదా 2028 ప్రారంభంలో ఇది భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుత మోడల్ కంటే ఇది మరింత అగ్రెసివ్ లుక్‌తో రాబోతోంది. స్లీకర్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, వెడల్పాటి గ్రిల్, కొత్త బంపర్లతో దీని ఫ్రంట్ లుక్ అదిరిపోనుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్, టెయిల్ గేట్‌పై ఫార్చ్యూనర్ అనే బోల్డ్ టెక్స్ట్ దీనికి మరింత రాజసాన్ని ఇస్తాయి.
కొత్త ఫార్చ్యూనర్ లోపల అడుగుపెడితే ఒక లగ్జరీ ప్రపంచం కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో రెండు 12.3-అంగుళాల స్క్రీన్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పని చేస్తాయి. వీటితో పాటు 360-డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ క్లైమేట్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీని మరింత స్మార్ట్‌గా మార్చనున్నాయి.
కేవలం ఫార్చ్యూనర్ మాత్రమే కాకుండా, టయోటా తన 9వ జనరేషన్ హైలక్స్ ను కూడా త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో ప్రదర్శించిన ఈ మోడల్, మునుపటి కంటే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. భారత్‌తో పాటు పొరుగు దేశాల మార్కెట్లకు కూడా ఇక్కడి నుండే వాహనాలను ఎగుమతి చేయాలని టయోటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ పెట్టుబడితో భారత ఆటోమొబైల్ రంగంలో టయోటా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుంది.

