టయోటా రూమియన్ బడ్జెట్ వేరియంట్ వచ్చేసింది

Toyota Rumion : భారతీయ రోడ్లపై టయోటా కార్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి టయోటా ఎంపీవీలు అంటే అమితమైన ఇష్టం. అయితే, బడ్జెట్ ఇబ్బందుల వల్ల చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసం టయోటా ఇప్పుడు ఒక అదిరిపోయే వార్త చెప్పింది. తన పాపులర్ మోడల్ రూమియన్ లో సరికొత్త ఎంట్రీ లెవల్ E ట్రిమ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.9.56 లక్షలు మాత్రమే. ఇప్పటివరకు బేస్ వేరియంట్‌గా ఉన్న S మోడల్ కంటే ఇది ఏకంగా 95 వేల రూపాయలు తక్కువ కావడం విశేషం.

ఈ కొత్త E వేరియంట్ ధర తగ్గించినప్పటికీ, లుక్ పరంగా మాత్రం టయోటా ఎక్కడా రాజీ పడలేదు. ముందు భాగంలో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన భారీ గ్రిల్, ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్ లాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు కారుకు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. 15-అంగుళాల స్టీల్ వీల్స్, సిల్వర్ వీల్ క్యాప్స్ దీనికి మరింత అందాన్ని జోడించాయి. తక్కువ ధరలో ఒక బ్రాండెడ్ 7-సీటర్ కారు కావాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, సేఫ్టీకి టయోటా పెద్ద పీట వేసింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు పవర్ విండోస్ వంటి అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే, ధర తగ్గించడం కోసం కొన్ని లగ్జరీ ఫీచర్లను ఇందులో తొలగించారు. ముఖ్యంగా మ్యూజిక్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్, ఈబీడీ వంటి ఫీచర్లు ఈ బేస్ వేరియంట్‌లో ఉండవు. కేవలం బడ్జెట్ లో మంచి కారు కొని, కావాల్సిన ఫీచర్లను బయట మార్కెట్లో అమర్చుకోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే, ఇందులో నమ్మకమైన 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 103 BHP పవర్, 137 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కొత్త వేరియంట్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైలేజ్ విషయంలో కూడా ఇది వినియోగదారులను నిరాశ పరచదు. లీటరుకు సుమారు 20.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మారుతి ఎర్టిగా, కియా క్యారెన్స్ వంటి కార్లకు ఈ కొత్త రూమియన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story