Toyota : ఎస్‌యూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. 2030 నాటికి టయోటా నుంచి 15 కొత్త కార్లు
2030 నాటికి టయోటా నుంచి 15 కొత్త కార్లు

Toyota : భారత మార్కెట్‌లో ఎస్‌యూవీల జోరు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్ ఒక సంచలన ప్రకటన చేసింది. టయోటా రాబోయే రోజుల్లో ఏకంగా 15 కొత్త మోడళ్లను 2030 నాటికి భారత మార్కెట్‌లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తృత ప్రణాళికలో అత్యంత చవకైన పికప్ ట్రక్‌తో పాటు, అద్భుతమైన ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం ఉన్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే వంటి కొత్త ఎస్‌యూవీలు ప్రధానంగా ఉన్నాయి. ఈ భారీ ఉత్పత్తుల విస్తరణతో టయోటా, మహీంద్రా, హ్యుందాయ్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని టయోటా మోటార్ కార్పొరేషన్ ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. టయోటా 2030 నాటికి 15 కొత్త మోడళ్లను (వీటిలో ఫేస్‌లిఫ్ట్‌లు, సుజుకి భాగస్వామ్యంతో కూడిన మోడళ్లు కూడా ఉన్నాయి) విడుదల చేయనుంది. ఈ ప్రొడక్షన్ స్ట్రాటజీలో ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై దృష్టి సారించనున్నారు. మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడమే ఈ ప్రణాళిక లక్ష్యం.
ఇటీవల ప్రదర్శించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే, కొత్త ఐఎంవీ 0 లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా తయారయ్యే మరో ఎస్‌యూవీ ఈ ఫ్యూచర్ లైనప్‌లో భాగంగా ఉంటాయి. టయోటా సంస్థ భారతదేశంలోని పట్టణ, గ్రామీణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఒక చవకైన పికప్ ట్రక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్, ఇప్పటికే టయోటా లైనప్‌లో ఉన్న హైలక్స్ కంటే తక్కువ ధరలో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌కు అనుకూలమైన వాహనం కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ కొత్త పికప్ ట్రక్ చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే దీని ఉత్పత్తి, పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఫ్యామిలీ నుంచి చిన్న మోడల్ అయిన ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే 2028లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే 2028 రెండవ భాగంలో దీపావళి సమయానికి భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీలో 2.7 లీటర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వంటి అనేక పవర్‌ట్రైన్ ఆప్షన్లు ఉంటాయి.
సుమారు 4.6 మీటర్ల పొడవు ఉండే ఈ ఎస్‌యూవీ, ల్యాండ్ క్రూయిజర్ ఫ్యామిలీలో అత్యంత చిన్న మోడల్. దీని బాక్సీ షేప్ ఫార్చ్యూనర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇంటీరియర్ డిజైన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో నుంచి ప్రేరణ పొందింది. టయోటా దేశీయంగా తమ తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, తమ మార్కెట్ విస్తరణ కోసం కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. కంపెనీ తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షలకు పైగా యూనిట్లకు పెంచాలని యోచిస్తోంది. దీని కోసం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో కొత్త తయారీ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించనుంది.
టయోటాకు కర్ణాటకలో ఇప్పటికే రెండు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మహారాష్ట్ర ప్లాంట్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు కొత్త ఎస్‌యూవీ కేటగిరీల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది. పట్టణ మార్కెట్‌లో ఇప్పటికే స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇప్పుడు గ్రామీణ, చిన్న పట్టణాల మార్కెట్‌లో తమ ఉనికిని బలోపేతం చేయాలని చూస్తోంది. ఇందుకోసం తక్కువ ఖర్చుతో చిన్న వర్క్‌షాప్‌లు, షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.

