ఇన్నోవా, ఫార్చ్యూనర్ తర్వాత టయోటా నుంచి అదిరిపోయే కార్లు

Toyota : భారత మార్కెట్‌లో ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి కార్లతో స్థానం సంపాదించుకున్న టయోటా ఇప్పడు తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంపెనీ రాబోయే సంవత్సరాలలో తమ కార్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్-ఫ్యూయెల్ వంటి వివిధ రకాల పవర్‌ట్రెయిన్‌లతో కూడిన కార్లను తీసుకురాబోతోంది. టయోటా కంపెనీ 2026 నాటికి భారత మార్కెట్‌లో నాలుగు కొత్త, ముఖ్యమైన మోడళ్లను విడుదల చేయనుంది. అవి అర్బన్ క్రూజర్ ఈవీ, హైరైడర్ బెస్డ్ 7-సీటర్ ఎస్‌యూవీ, మారుతి సుజుకి విక్టోరిస్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్, న్యూ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్. అయితే, ఈ మోడళ్ల విడుదల గురించి టయోటా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అర్బన్ క్రూజర్ ఈవీ

టయోటా అర్బన్ క్రూజర్ ఈవీని ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రిక్ కారు రాబోయే మారుతి ఇ-విటారా తో ప్లాట్‌ఫారమ్, పవర్‌ట్రెయిన్, ఫీచర్లను పంచుకుంటుంది. కానీ డిజైన్ భిన్నంగా ఉంటుంది. ఈ ఈవీలో 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. దీని టాప్ వేరియంట్ 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదని భావిస్తున్నారు. ఈ కారు 143 bhp, 173 bhp కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది.

7-సీటర్ ఎస్‌యూవీలు

7-సీటర్ హైరైడర్ మోడల్‌ను, మారుతి సుజుకి విక్టోరిస్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌ను కూడా టయోటా తీసుకురానుంది. ఈ రెండు ఎస్‌యూవీలలో పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్జీ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5 లీటర్ అట్కిన్సన్-సైకిల్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్, eCVT గేర్‌బాక్స్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. దీని ద్వారా మంచి మైలేజ్ లభించే అవకాశం ఉంది.

న్యూ జనరేషన్ ఫార్చ్యూనర్

టయోటా టాప్ ఎస్యూవీ అయిన ఫార్చ్యూనర్ న్యూ జనరేషన్ మోడల్ కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఫార్చ్యూనర్ డిజైన్ కొత్త హైలక్స్ నుండి ప్రేరణ పొందినట్లు సమాచారం. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు లభించవచ్చు. కొత్త ఫార్చ్యూనర్‌లో ప్రస్తుత డీజిల్ ఇంజన్‌తో పాటు, 48V నియో డ్రైవ్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story