Toyota : రెట్రో లుక్, మోడ్రన్ డిజైన్.. టయోటా నుంచి కొత్త ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే
టయోటా నుంచి కొత్త ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే

Toyota : టోక్యోలో జరుగుతున్న జపాన్ మొబిలిటీ షో 2025లో టయోటా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. అదే టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే. ల్యాండ్ క్రూజర్ సిరీస్ స్ట్రాంగ్ ఆఫ్-రోడ్ DNA ని కలిగి ఉన్న ఈ కొత్త మోడల్, దాని పెద్ద అన్న ఫార్చ్యూనర్ కంటే చిన్నదిగా, కానీ చాలా ఎత్తుగా ఉంది. ఈ ఎస్‌యూవీ 2026 మధ్యలో మొదట జపాన్‌లో ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లలో విడుదల కానుంది.
టయోటా తమ ప్రసిద్ధ ల్యాండ్ క్రూజర్ శ్రేణిలోని కొత్త మోడల్, ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జేను తాజాగా జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించింది. ఎఫ్‌జే డిజైన్లో పాత, కొత్త స్టైల్స్ కలయిక కనిపిస్తుంది. ఒక రకమైన ఫ్రంట్ డిజైన్లో పాత FJ40 మోడల్‌ను గుర్తుచేసే గుండ్రటి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. మరొక డిజైన్లో ఆధునిక C-షేప్ LED లైట్లను ఇచ్చారు. రెండింటిలోనూ TOYOTA అని రాసి ఉన్న సింపుల్ గ్రిల్, స్ట్రాంగ్ బంపర్లు ఉన్నాయి.
ఎఫ్‌జే అనేది ఫార్చ్యూనర్ కంటే చిన్నది. పొడవు 4,575 మి.మీ, ఎత్తు 1,960 మి.మీ, 1,855 మి.మీ. ఉంటుంది. వెడల్పులో ఫార్చ్యూనర్ ఎఫ్ జే రెండూ సమానంగా ఉంటాయి. ఎఫ్‌జే వీల్‌బేస్ (2,580 మి.మీ) ఫోర్ట్యూనర్ (2,745 మి.మీ) కంటే తక్కువగా ఉండటం వలన ఇది ఆఫ్-రోడింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుంది. ఎఫ్‌జే ఇంటీరియర్ కూడా దాని బాహ్య రూపంలాగే దృఢంగా, ఉపయోగకరంగా ఉంది. ఇందులో గట్టిదైన స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి. డాష్‌బోర్డ్‌పై ఫిజికల్ క్లైమేట్ కంట్రోల్ నాబ్స్, ఎత్తుగా ఉన్న గేర్ లీవర్ దీనికి రఫ్ అండ్ టఫ్ అనుభూతిని ఇస్తాయి.
ప్రామాణిక ఫీచర్లలో టయోటా సేఫ్టీ సెన్స్ ఉంటుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, ప్రీ-కొలిజన్ బ్రేకింగ్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీలు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 2.7 లీటర్ 2TR-FE పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇదే ఇంజిన్‌ను అనేక మార్కెట్లలో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ లలో కూడా ఉపయోగిస్తారు. ఇది 161 hp పవర్‌ను, 246 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, పార్ట్-టైమ్ 4WD (ఆల్-వీల్-డ్రైవ్) సిస్టమ్ ఉన్నాయి.ఈ ఎస్‌యూవీ 2026 మధ్యలో మొదట జపాన్‌లో విడుదల అవుతుంది, ఆ తర్వాత ఇతర ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటుంది.

