Toyota Vellfire : భారతదేశంలో లగ్జరీ కార్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. కోట్లు ఖరీదు చేసే కార్లు కూడా ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీనికి తాజా నిదర్శనం టయోటా కంపెనీకి చెందిన అల్ట్రా లగ్జరీ ఎంపీవీ వెల్‌ఫైర్. కోటి రూపాయలకు పైగా ధర ఉన్నప్పటికీ ఈ కారు భారత మార్కెట్లో 5,000 యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం గడిచిన రెండేళ్లలోనే దీనికి డిమాండ్ రెట్టింపు అవ్వడం విశేషం.

సినిమా స్టార్లు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ దిగ్గజాలు ఎక్కడికి వెళ్లినా ఇప్పుడు వెల్‌ఫైర్ కారులోనే కనిపిస్తున్నారు. టయోటా పోర్ట్‌ఫోలియోలో ల్యాండ్ క్రూజర్ తర్వాత ఇదే అత్యంత ఖరీదైన కారు. 2020లో ఇండియాలో అడుగుపెట్టిన ఈ కారు, 2024లో సెకండ్ జనరేషన్ మోడల్‌తో మరింత విలాసవంతంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు అమ్ముడైన మొత్తం కార్లలో దాదాపు 55 శాతం వాహనాలు కేవలం గత 25 నెలల్లోనే విక్రయించబడ్డాయి. దీన్ని బట్టి భారతీయులు లగ్జరీ కోసం ఎంతగా ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

టయోటా వెల్‌ఫైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్ల మధ్య ఉంటుంది. అయితే రోడ్డు మీదకు వచ్చేసరికి ట్యాక్స్‌లన్నీ కలుపుకుని దీని ధర దాదాపు రూ.1.50 కోట్లు దాటేస్తుంది. ఇంత భారీ ధర చెల్లించేది కేవలం కారు కోసమే కాదు.. అందులో ఉండే రాజభోగాల కోసం. కారు లోపలికి వెళ్తే ఇది ఒక లగ్జరీ హోటల్ గదిలానో లేక ప్రైవేట్ జెట్ విమానం లాగానో అనిపిస్తుంది. క్వాలిటీ మెటీరియల్స్, ప్రీమియం ఫినిషింగ్‌తో దీని క్యాబిన్ అద్భుతంగా ఉంటుంది.

వెల్‌ఫైర్ అసలైన మ్యాజిక్ దాని సీట్లలోనే ఉంది. ముఖ్యంగా రెండో వరుసలో ఉండే ఎగ్జిక్యూటివ్ లాంజ్ సీట్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతినిస్తాయి. ఈ సీట్లకు మసాజ్ సదుపాయం ఉంటుంది, దీనివల్ల ఎంత దూర ప్రయాణం చేసినా అలసట అనేది దరిచేరదు. వీటిని మనకు నచ్చినట్లుగా 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారులో 14 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఎండ తగలకుండా సన్ షేడ్స్, మల్టిపుల్ ఏసీ వెంట్లతో ప్రయాణం చాలా కూల్ గా సాగుతుంది.

టయోటా వెల్‌ఫైర్ విజయం వెనుక ఆ కంపెనీపై ఉన్న నమ్మకం కూడా ఒక ప్రధాన కారణం. కోట్లు పెట్టి కొన్నాక మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉండటం టయోటా ప్రత్యేకత. అందుకే ధనవంతులు ఇతర లగ్జరీ బ్రాండ్ల కంటే వెల్‌ఫైర్‌ను నమ్ముతున్నారు. ప్రస్తుతానికి మార్కెట్లో ఈ స్థాయి లగ్జరీని అందించే మరో ఎంపీవీ లేకపోవడం కూడా వెల్‌ఫైర్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. భవిష్యత్తులో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story