Toyota : ప్రముఖ జపనీస్ వాహన దిగ్గజం టయొటా (Toyota) భారత మార్కెట్‌పై పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా 2026లో భారీ స్కెచ్ వేసింది. మల్టీ-పవర్‌ట్రెయిన్ వ్యూహంతో.. అంటే ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ విభాగాల్లో ఏకంగా నాలుగు కొత్త ఎస్‌యూవీ (SUV)లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా మన దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న ఫార్చ్యూనర్ కొత్త మోడల్‌తో పాటు, తన తొలి ఎలక్ట్రిక్ కారును కూడా టయొటా రంగంలోకి దింపబోతోంది.

టయొటా ఈబెలా

టయొటా నుంచి రాబోతున్న తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. 49 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ సుమారు 440 కి.మీల రేంజ్ ఇస్తుండగా, పెద్దదైన 61 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం. ఇది E1, E2, E3 అనే మూడు ట్రిమ్స్ లో లభించనుంది. 174 బిహెచ్‌పి పవర్‌తో ఈ కారు రోడ్లపై దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది.

హైరైడర్ ఫేస్‌లిఫ్ట్, 7-సీటర్ మోడల్

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అర్బన్ క్రూజర్ హైరైడర్ 2026లో కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతోంది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కీలక మార్పులు ఉండనున్నాయి. దీనితో పాటు, పెద్ద కుటుంబాల కోసం 7-సీటర్ హైరైడర్‌ను కూడా టయొటా తీసుకువస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఇందులో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కొనసాగించనున్నారు. అదనపు సీట్ల కోసం దీని పొడవును పెంచుతున్నట్లు తెలుస్తోంది.

నెక్స్ట్ జనరేషన్ టయొటా ఫార్చ్యూనర్

ఎస్‌యూవీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త తరం ఫార్చ్యూనర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారత్‌లోకి ఇది 2026 ఆఖరులో లేదా 2027 మొదట్లో వచ్చే అవకాశం ఉంది. ఇది కొత్త హిలక్స్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా డిజైన్ చేయబడుతోంది. ఇందులో ప్రస్తుతం ఉన్న 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. అయితే, డీజిల్ ఇంజిన్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను జోడించడం ద్వారా మైలేజ్, పెర్ఫార్మెన్స్‌ను పెంచనున్నారు.

మల్టీ-పవర్‌ట్రెయిన్ వ్యూహం

టయొటా కేవలం ఒక రకమైన ఇంధనానికే పరిమితం కాకుండా.. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో కార్లను విడుదల చేస్తోంది. దీనివల్ల కస్టమర్లకు తమ అవసరానికి తగ్గట్టుగా కారును ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అదిరిపోయే డిజైన్, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు, సుస్థిరమైన ఇంజిన్ పనితీరుతో 2026లో టయొటా భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story