టయోటా నుంచి రెండు పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు

Toyota : భారతదేశంలో టయోటా కార్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి, ఎస్‌యూవీ లవర్స్ కు టయోటా ఒక నమ్మకమైన బ్రాండ్. ఇప్పుడు అదే నమ్మకాన్ని మరింత పెంచుతూ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లోకి రెండు సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 2030 నాటికి ఏకంగా 15 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలనే భారీ ప్లాన్‌తో ఉన్న టయోటా, ఇందుకోసం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తన ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతోంది. త్వరలోనే రాబోతున్న ఆ రెండు దర్పాన్ని ఒలకబోసే కార్ల వివరాలు మీకోసం..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 5-సీటర్ అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు భారీ డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, టయోటా ఇప్పుడు హైరైడర్ 7-సీటర్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ దశలో ఉంది. 5-సీటర్ మోడల్ కంటే ఇది పొడవుగా ఉండటమే కాకుండా, మూడో వరుస ప్రయాణికులకు కూడా మంచి లెగ్ స్పేస్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ కారులో 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా అందించబోతున్నట్లు సమాచారం. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చు.

ఇక ఎస్‌యూవీల ప్రపంచంలో డాన్ అనిపించుకునే టయోటా ఫార్చ్యూనర్ త్వరలోనే సరికొత్త అవతారంలో మెరవనుంది. నెక్ట్స్ జనరేషన్ ఫార్చ్యూనర్‌లో డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఇది చూడటానికి మరింత గంభీరంగా, అంతర్జాతీయ స్థాయిలో ఉండే హిలక్స్ పికప్ ట్రక్ డిజైన్ ప్రేరణతో రానుంది. ఇందులో అత్యాధునిక టయోటా సేఫ్టీ సెన్స్ 3 ADAS ఫీచర్లు, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ వ్యూ మానిటర్ వంటి హైటెక్ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇంజన్ పరంగా పాత నమ్మకమైన 2.8 లీటర్ డీజిల్, 2.7 లీటర్ పెట్రోల్ ఆప్షన్లే కొనసాగే అవకాశం ఉంది.

కేవలం ఈ రెండు మాత్రమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో టయోటా నుంచి అర్బన్ క్రూజర్ ఎబేలా పేరుతో ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా రాబోతోంది. అలాగే మారుతి సుజుకి సహకారంతో కొత్త గ్లాంజా, టేజర్ మోడళ్లను కూడా అప్‌డేట్ చేయనున్నారు. ఆఫ్-రోడింగ్ లవర్స్ కోసం ల్యాండ్ క్రూజర్ FJ వంటి మోడళ్లు కూడా లైన్లో ఉన్నాయి. మొత్తానికి రాబోయే కొన్నేళ్లు టయోటా లవర్స్‌కు పండగే అని చెప్పాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story