Toyota : ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది.

Toyota : ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇంతకాలం నెమ్మదిగా అడుగులు వేసిన ఈ జపనీస్ కార్ల కంపెనీ, ఇకపై వేగంగా ముందుకు దూసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఏకంగా 15 కొత్త, అప్‌డేటెడ్ కార్లను విడుదల చేయాలని టయోటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ విస్తరణ ప్రణాళికలో భాగంగా టయోటా, ముఖ్యంగా చిన్న కార్ల సెగ్మెంట్‌పై దృష్టి పెట్టడంతో పాటు మారుతి సుజుకి, హ్యుందాయ్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు భారీ పెట్టుబడులు, కొత్త షోరూమ్‌లు, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతోంది.


జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ భారత మార్కెట్‌లో తన పట్టును పెంచుకునేందుకు అంబిషియస్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ 2030 నాటికి భారత్‌లో 15 కొత్త మోడళ్లు లేదా అప్‌డేట్ చేసిన కార్లను విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. చైనా వంటి మార్కెట్లలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం ప్రపంచ కార్ల కంపెనీలకు ఎంత ముఖ్యమైనదో ఈ ప్రణాళిక ద్వారా స్పష్టమవుతోంది. మారుతి సుజుకితో భాగస్వామ్యంపై ఆధారపడకుండా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని టయోటా చూస్తోంది.


ప్రస్తుతం టయోటా 8% ఉన్న భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్ వాటాను 2030 నాటికి 10%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి టయోటా తన రికార్డు లాభాలను పెట్టుబడిగా పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటి హైబ్రిడ్ కార్లకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ దాదాపు $640 మిలియన్ డాలర్ల రికార్డు లాభాన్ని నమోదు చేసింది. ఈ విజయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు టయోటా సుమారు $3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడిలో కొంత భాగం కర్ణాటక ప్లాంట్‌ను విస్తరించడానికి ఉపయోగించబడుతుంది. దీంతో పాటు మహారాష్ట్రలో కొత్త తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు ప్లాంట్‌లను కలిపి టయోటా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం త్వరలో సంవత్సరానికి 10 లక్షల కార్లకు పైగా చేరుకోవచ్చు.


టయోటా ఈ కొత్త కార్ల లైనప్‌లో విభిన్న మోడల్స్ ఉంటాయి. ఈ కొత్త లైనప్‌లో టయోటా స్వయంగా అభివృద్ధి చేసిన ఎస్‌యూవీలు, సుజుకి నుంచి తీసుకున్న భాగస్వామ్య మోడల్‌లు, ప్రస్తుతం ఉన్న కార్ల కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం మారుతి సుజుకి, హ్యుందాయ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్న భారత మార్కెట్‌లో, ముఖ్యంగా చిన్న కార్ల సెగ్మెంట్, ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కొత్త కార్లతో టయోటా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

PolitEnt Main

PolitEnt Main

Next Story