Car LED Headlight Rules : కారుకు హై-పవర్ ఎల్‌ఈడీ లైట్లు వాడుతున్నారా? పోలీసుల కన్ను పడితే చలాన్ ఖాయం
పోలీసుల కన్ను పడితే చలాన్ ఖాయం

Car LED Headlight Rules : కార్ల హెడ్‌లైట్ల విషయంలో మీరు కూడా స్టైల్ కోసం వెతుకుతున్నారా? అయితే జాగ్రత్త. మీ కారుకు అమర్చిన ఆ మిరుమిట్లు గొలిపే ఎల్‌ఈడీ లైట్లు మీ జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, మిమ్మల్ని చిక్కుల్లో పడేయవచ్చు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు హై-పవర్ ఎల్‌ఈడీ లైట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 300 వాట్ల వరకు ఉండే అతి ప్రకాశవంతమైన లైట్లు వాడితే భారీ జరిమానాలు తప్పవు. చాలామంది కారు యజమానులు రాత్రి వేళల్లో మంచి వెలుతురు ఉండాలని లేదా కారు లుక్ మారాలని మార్కెట్లో దొరికే 100 నుంచి 300 వాట్ల ఎల్‌ఈడీ లైట్లను బిగించుకుంటున్నారు. నిజానికి, కంపెనీ ఇచ్చే సాధారణ బల్బుల కంటే ఇవి రెట్టింపు వెలుతురును ఇస్తాయి. కానీ, ఈ విపరీతమైన ప్రకాశం ఎదురుగా వచ్చే డ్రైవర్ల కళ్లను తాత్కాలికంగా గుడ్డివారిని చేస్తుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, కంపెనీ ఫిట్ చేసిన లైట్ల డిజైన్‌లో మార్పులు చేయడం చట్టవిరుద్ధం.
జరిమానా ఎంత ఉండొచ్చు?
నిబంధనలకు విరుద్ధంగా హై-పవర్ లైట్లను వాడుతున్నట్లు తేలితే, పోలీసులు మొదటిసారి రూ. 500 నుంచి రూ. 5000 వరకు చలాన్ విధించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఈ జరిమానా రూ. 10,000 వరకు కూడా వెళ్లవచ్చు. కేవలం ఫైన్ తోనే సరిపెట్టకుండా, ఆ అక్రమ లైట్లను వెంటనే తొలగించాలని ఆదేశిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే లేదా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది.
ఏ లైట్లు వాడాలి? రూల్స్ ఏం చెబుతున్నాయి?
సాధారణంగా ప్రతి బల్బుకు 60 వాట్ల లోపు పవర్ ఉండటం సురక్షితమైన పరిమితిగా పరిగణించబడుతుంది. అలాగే, వెలుతురు తీవ్రత 3000 ల్యూమెన్స్ కంటే తక్కువగా ఉండాలి. భారతదేశంలో కేవలం తెలుపు లేదా లేత పసుపు రంగు లైట్లు మాత్రమే అనుమతించబడతాయి. నీలం, ఎరుపు లేదా మల్టీ-కలర్ లైట్లను వాడటం పూర్తిగా నిషేధం. హ్యాలోజన్ లైట్ల కోసం తయారు చేసిన రిఫ్లెక్టర్లలో నేరుగా ఎల్‌ఈడీ బల్బులను బిగించడం కూడా నేరమే, ఎందుకంటే అది లైట్ ఫోకస్ ను తప్పుగా మారుస్తుంది.
ముందస్తు జాగ్రత్తలు
మీరు సెకండ్ హ్యాండ్ కారు కొన్నా లేదా కొత్తగా లైట్లు మార్చాలనుకున్నా.. ముందుగా అవి ఆమోదించబడిన పరిమితిలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లైట్ ఎలైన్‌మెంట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. అంటే వెలుతురు నేరుగా ఎదుటివారి కళ్లలో పడకుండా రోడ్డు మీద పడేలా ఉండాలి. హై-బీమ్ వాడకం పట్ల కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా హై-బీమ్ వాడటం వల్ల కూడా చలాన్లు పడే అవకాశం ఉంది. కాబట్టి, సేఫ్ డ్రైవింగ్ కోసం నియమాలను పాటించడం అందరికీ శ్రేయస్కరం.

