Triumph 350 : బుల్లెట్ అడ్డాపై ట్రయంఫ్ దండయాత్ర.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెక్ పెట్టేలా కొత్త 350cc బైక్
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెక్ పెట్టేలా కొత్త 350cc బైక్

Triumph 350 : భారతీయ రోడ్లపై రెట్రో బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఏళ్ల తరబడి ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతోంది. అయితే, ఇప్పుడు ఆ రాజ్యానికి సవాల్ విసరడానికి బ్రిటిష్ దిగ్గజం ట్రయంఫ్ సిద్ధమైంది. బజాజ్ ఆటోతో జతకట్టిన ట్రయంఫ్, ఇప్పటికే స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X వంటి బైక్‌లతో మార్కెట్‌ను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు తాజాగా 350cc సెగ్మెంట్‌లో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఈ బైక్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా దొరికిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కొత్త బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది పక్కా ఓల్డ్ స్కూల్ రెట్రో వైబ్‌ను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్పీడ్ 400 కంటే ఇది భిన్నంగా ఉండబోతోంది. క్లాసిక్ లుక్ కోసం దీనికి వైర్-స్పోక్ వీల్స్, రౌండ్ హెడ్‌లైట్, సరికొత్త రెట్రో బాడీ ప్యానెల్స్‌ను అమర్చారు. ముఖ్యంగా ఇందులో కొత్తగా రూపొందించిన గుండ్రటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు పాత తరం బైక్‌లను గుర్తుచేస్తుంది. అలాగే బైక్ కింద భాగంలో ఇంజన్ రక్షణ కోసం కొత్త రేడియేటర్ గ్రిల్, బెలీ పాన్‌ను కూడా అమర్చడం విశేషం.
సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. ఈ బైక్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. స్పీడ్ 400లో ఉన్న మోనో-షాక్ సస్పెన్షన్‌కు బదులుగా, క్లాసిక్ లుక్ కోసం ఇందులో ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌ను ఉపయోగించారు. అలాగే ముందు వైపు ఉన్న అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్‌కు బదులుగా టెలిస్కోపిక్ ఫోర్క్స్‌ను అమర్చారు. భద్రత కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్‌ను అందించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కుడి వైపున ఉండటం గమనార్హం.
ఇంజన్ విషయానికి వస్తే, ట్రయంఫ్ దీని కోసం ప్రత్యేకంగా 350cc TR-సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ధర విషయంలోనూ సామాన్యులకు అందుబాటులో ఉండేలా బజాజ్ ప్లాన్ చేస్తోంది. బహుశా ఇది ట్రయంఫ్ బ్రాండ్ నుంచి వచ్చే అత్యంత చవకైన బైక్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ బైక్ భారత రోడ్లపై పరుగులు తీసే ఛాన్స్ ఉంది.

