Triumph 350cc : రాయల్ ఎన్ఫీల్డ్కు చుక్కలే..350 సీసీ సెగ్మెంట్‌లోకి ట్రయంఫ్ ఎంట్రీ..ధర వింటే షాక్ అవ్వాల్సిందే
350 సీసీ సెగ్మెంట్‌లోకి ట్రయంఫ్ ఎంట్రీ..ధర వింటే షాక్ అవ్వాల్సిందే

Triumph 350cc : బ్రిటీష్ ప్రీమియం బైక్ బ్రాండ్ ట్రయంఫ్ భారతీయ బైక్ ప్రియులకు అదిరిపోయే తీపి కబురు చెప్పబోతోంది. 2026 ఏప్రిల్ నాటికి 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన సరికొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 398 సీసీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని, ఒక పవర్ ఫుల్ 350 సీసీ ఇంజిన్‌ను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ కొత్త మోడళ్లు వచ్చిన తర్వాత పాత 400 సీసీ బైక్‌ల అమ్మకాలు కొనసాగుతాయా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ మార్పు వెనుక ఒక బలమైన ఆర్థిక కారణం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరించిన జీఎస్టీ విధానం వల్ల 350 సీసీ లోపు ఉండే బైక్‌లపై పన్ను భారం కేవలం 18 శాతంగా ఉంది. అదే 350 సీసీ దాటితే ఏకంగా 40 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించి, కస్టమర్లకు తక్కువ ధరకే ప్రీమియం బైక్‌లను అందించాలనే ఉద్దేశంతో బజాజ్ ఆటో, కేటీఎం, ట్రయంఫ్ కంపెనీలు కలిసి ఈ కొత్త ఇంజిన్‌ను రూపొందిస్తున్నాయి. దీనివల్ల బైక్ ధర భారీగా తగ్గి, సామాన్యుడికి కూడా ట్రయంఫ్ బ్రాండ్ చేరువయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం మిడ్-సైజ్ బైక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ట్రయంఫ్ 350 సీసీ బైక్ వస్తే, అది నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ వంటి మోడళ్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు అదే స్టైల్, క్వాలిటీతో తక్కువ ధరకు 350 సీసీ వెర్షన్ వస్తే, మార్కెట్ లెక్కలు మారిపోవడం ఖాయం.
డిజైన్, ఫీచర్ల పరంగా ఈ కొత్త బైక్‌లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇంజిన్ కెపాసిటీ తగ్గడం వల్ల పవర్, టార్క్‌లో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, రైడింగ్ కంఫర్ట్, ప్రీమియం లుక్ అలాగే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 ఏప్రిల్ నాటికి ఈ కొత్త చౌక ట్రయంఫ్ బైక్‌లు షోరూమ్‌లలో దర్శనమిచ్చే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్ ఇమేజ్ ఉన్న ట్రయంఫ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరకే బైక్‌లను అందిస్తే, యువత చూపు ఖచ్చితంగా ఈ బ్రిటీష్ బ్రాండ్ వైపు మళ్లుతుంది.

