Triumph: మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త బైక్ లాంచ్ సమయం వచ్చేసింది. స్టైలిష్ లుక్‌తో పాటు శక్తివంతమైన ఇంజిన్ కోరుకునే రైడర్ల కోసం ట్రయంఫ్ సంస్థ మరో అద్భుతమైన మోడల్‌ను పరిచయం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో పలు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమైంది. ఇందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ బోన్విల్లె 400. గత కొన్ని నెలలుగా టెస్టింగ్ దశలో కనిపిస్తున్న ఈ మోడరన్ రెట్రో బైక్ కోసం టూ-వీలర్ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ట్రయంఫ్ సంస్థకు చెందిన 400 పోర్ట్‌ఫోలియోలో ఈ బోన్విల్లె 400 ఒక ఎక్స్ ట్రా మోడల్‌గా నిలవనుంది. గతంలో వచ్చిన స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 మోడల్స్‌తో పోలిస్తే దీని డిజైన్ కంప్లీట్ డిఫరెంటుగా ఉంటుంది. ఇందులో ఆధునిక సస్పెన్షన్‌కు బదులుగా క్లాసిక్ లుక్ అందించే గెటర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్ అమర్చారు. దీనికి సంబంధించిన ఛాసిస్ అలాగే స్వింగ్‌ఆర్మ్ పూర్తిగా కొత్త డిజైన్‌తో రూపొందించారు. పెద్ద మోడల్స్ అయిన టీ100, టీ120 డిజైన్‌ను పోలి ఉండే ఈ బైక్‌లో టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్లాట్ బెంచ్ సీట్, రౌండ్ హెడ్‌ల్యాంప్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌‌లో పవర్ ఫుల్ ఇంజిన్‌ను పొందుపరిచారు. భారత్‌లో రిలీజ్ కానున్న ఈ వెర్షన్‌లో 349cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ లభించే అవకాశం ఉంది. సులువుగా ప్రయాణించేందుకు వీలుగా ఈ ఇంజిన్‌ను రిలాక్స్డ్ ట్యూన్ స్టేట్‌లో ఉంచారు. ఇది దాదాపు స్పీడ్ టీ4 మోడల్ ఇచ్చే 29హెచ్‌పీ పవర్, 31ఎన్ఎం టార్క్ సామర్థ్యాన్ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ ట్రిప్స్‌కు కూడా ఈ ఇంజిన్ చాలా అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ట్రయంఫ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ బోన్విల్లె 400 నేరుగా ట్రెడిషనల్ రెట్రో రోడ్స్టర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో హోండా సీబీ350 సిరీస్‌‌తో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 వంటి దిగ్గజ బైక్‌లు హవా నడిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లోకి ట్రయంఫ్ కొత్త బైక్ ప్రవేశించడం ద్వారా పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. కస్టమర్లకు మరింత మెరుగైన ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story