6 నెలల్లో 29 కొత్త బైక్‌ల లాంచ్

Triumph : బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ రాబోయే ఆరు నెలల్లో మార్కెట్‌ను ఆక్రమించడానికి ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసిన ఈ కంపెనీ త్వరలో ఏకంగా 29 కొత్త, అప్‌డేటెడ్ బైక్‌లను విడుదల చేయనుంది. 2019తో పోలిస్తే గ్లోబల్ అమ్మకాలు 136% పెరిగిన తర్వాత, ట్రయంఫ్ తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ కొత్త రోడ్‌మ్యాప్‌లో ఏ మోడల్స్ ఉన్నాయి, ముఖ్యంగా భారత మార్కెట్‌కు ఏ బైక్‌లు రాబోతున్నాయో తెలుసుకుందాం.

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ రాబోయే ఆరు నెలల్లో 29 కొత్త, అప్‌డేటెడ్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రణాళిక అక్టోబర్ 21న MY26 బొన్నెవిల్లే రేంజ్ లాంచ్‌తో ప్రారంభమైంది. కంపెనీ గత రికార్డు బ్రేకింగ్ ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 1,41,683 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఇది 2019తో పోలిస్తే 136% అధికం.

బొన్నెవిల్లేతో పాటు, కంపెనీ ఇప్పటికే టీఎక్స్‌పీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్, టీఎఫ్ 450-ఎక్స్, రెండు క్రాస్-కంట్రీ మోడళ్లను ఈ సంవత్సరం చివరి నాటికి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచనుంది. మిగిలిన 22 లాంచ్‌లలో ఇప్పటికే ఉన్న మోడళ్ల అప్‌డేటెడ్ వెర్షన్‌లు, పూర్తిగా కొత్త మోడళ్లు ఉండనున్నాయి. ట్రయంఫ్ తన నెట్‌వర్క్‌ను ప్రపంచవ్యాప్తంగా 68 దేశాల్లోని 950కి పైగా డీలర్‌షిప్‌లకు విస్తరించింది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి ముఖ్యమైన మార్కెట్లలో ఇది మంచి విజయాన్ని సాధించింది.

ముఖ్యంగా బజాజ్ ఆటో భాగస్వామ్యంతో తయారు చేసిన సబ్-500సీసీ లైనప్‎లోని స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌సీ మోడళ్లు ఆసియా మార్కెట్‌లో కంపెనీ పట్టును బలోపేతం చేశాయి. ఈ లైనప్‌ను మరింత విస్తరించనున్నారు. ట్రయంఫ్ ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ విభాగంలో కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల లాంచ్ చేసిన TF 450-X తో పాటు, TF 250-X, TF 450-RC, TF 250-E వంటి మోడళ్లు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో విజయాలు సాధించాయి.

యువత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని, ట్రయంఫ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించింది. ఓఎస్‌ఈటీ సహకారంతో అభివృద్ధి చేసిన TXP ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రేంజ్ ను కంపెనీ విడుదల చేసింది. ఇవి తేలికపాటి ఛాసిస్, అధునాతన ఎర్గోనామిక్స్, ఇంటిగ్రేటెడ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నాయి.

ట్రయంఫ్ ఈ కొత్త మోడళ్లలో చాలా వరకు భారతదేశంలోనూ అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్‌, లిమిటెడ్ ఎడిషన్ ఆర్ఎక్స్ వంటి మోడళ్లను విడుదల చేసింది. 2026 బొన్నెవిల్లే రేంజ్ కూడా భారత మార్కెట్‌కు సరైన సమయంలో వస్తుందని భావిస్తున్నారు. ఈ విస్తృత ఉత్పత్తి వ్యూహం ద్వారా ట్రయంఫ్ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వినియోగదారుల అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story