TVS Apache : భారత రోడ్లపై అపాచీ సునామీ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న టీవీఎస్ పవర్
ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న టీవీఎస్ పవర్

TVS Apache : భారత టూవీలర్ మార్కెట్‌లో ఇప్పుడు 150cc నుంచి 200cc బైక్‌ల హవా నడుస్తోంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు స్టైలిష్ లుక్ కోరుకునే కుర్రాళ్లు ఈ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజా విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, ఈ విభాగం ఏకంగా 72 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇందులోనూ టీవీఎస్ అపాచీ తన విశ్వరూపాన్ని చూపిస్తూ, ప్రత్యర్థులైన బజాజ్, హోండా, యమహా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టేసి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
డిసెంబర్ 2025 నెల సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. టీవీఎస్ అపాచీ సిరీస్ కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోయింది. డిసెంబర్ 2024లో కేవలం 20,885 యూనిట్లు అమ్ముడైన ఈ బైక్, సరిగ్గా ఏడాది తర్వాత అంటే డిసెంబర్ 2025లో ఏకంగా 45,507 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంటే దాదాపు 117.89 శాతం వృద్ధిని సాధించి, ఈ సెగ్మెంట్ మార్కెట్ షేర్‌లో 28.73 శాతాన్ని తన సొంతం చేసుకుంది. టీవీఎస్ అందిస్తున్న రేసింగ్ టెక్నాలజీ మరియు అగ్రెసివ్ డిజైన్ ఈ విజయానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌ను ఏలిన బజాజ్ పల్సర్, హోండా యూనికార్న్ ఇప్పుడు అపాచీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పల్సర్ 35,620 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉండగా, హోండా యూనికార్న్ 33,640 యూనిట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ రెండు బైక్‌లు కూడా వరుసగా 70 శాతం, 60 శాతం వృద్ధిని సాధించినప్పటికీ అపాచీ దరిదాపుల్లోకి చేరలేకపోయాయి. ఆశ్చర్యకరంగా యమహా కొత్త మోడల్ XSR కూడా 14,951 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచి తన ఉనికిని చాటుకుంది.
మరోవైపు యమహా ఎఫ్ జెడ్, ఆర్15 కూడా పాజిటివ్ గ్రోత్ సాధించగా, యమహా ఎంటీ-15,హోండా ఎస్పీ 160 అమ్మకాలు మాత్రం గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా హీరో ఎక్స్‌ట్రీమ్, హోండా హార్నెట్ వంటి మోడళ్లు కుర్రాళ్ల ఆదరణను పొందడంలో ఈసారి విఫలమయ్యాయి. మొత్తానికి స్పోర్ట్స్ బైక్ కేటగిరీలో టీవీఎస్ తన ఆధిపత్యాన్ని చాటుతూ, 2026 ప్రారంభంలోనే ఇతర కంపెనీలకు గట్టి సవాల్ విసిరింది.

