EV Market: ఈవీ మార్కెట్‌లో సీన్ రివర్స్.. ఓలా, అథర్‌లను తొక్కుకుంటూ పాత దిగ్గజాల ఊచకోత
దిగ్గజాల ఊచకోత

EV Market: భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన కొన్ని ఈవీ స్టార్టప్‌లు ప్రారంభంలో హవా నడిపించినప్పటికీ, సుదీర్ఘ అనుభవం ఉన్న పాత వాహన తయారీ సంస్థలు మళ్లీ తమ పట్టును బిగించాయి. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్‌కి చెందిన విడా బ్రాండ్లు సెప్టెంబర్ నెల మొదటి 28 రోజుల్లోనే మొత్తం ఎలక్ట్రిక్ టూవీలర్ రిజిస్ట్రేషన్లలో ఏకంగా 61.8 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. ఆటోమొబైల్ రంగానికి పునాది వంటి ఈ సంప్రదాయ సంస్థల తయారీ క్వాలిటీ, విశ్వసనీయతపై కస్టమర్లు గట్టి నమ్మకం ఉంచుతున్నారని ఈ విక్రయాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నెంబర్ వన్ స్థానంలో టీవీఎస్
కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ నమోదు చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 28 నాటికి టీవీఎస్ మోటార్ సంస్థ 26.4 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లకు లభిస్తున్న విశేష ఆదరణ ఈ విజయానికి ప్రధాన కారణం. దీని వెనుకే బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ మోడళ్లతో 23.6 శాతం వాటాను దక్కించుకుని రెండవ స్థానంలో నిలిచింది. హీరో సంస్థకు చెందిన విడా బ్రాండ్ కూడా తన ఉనికిని చాటుకుంటూ 11.7 శాతం వాటాను నమోదు చేసింది. గత జూలై, ఆగస్టు నెలలతో పోలిస్తే ఈ మూడు దిగ్గజ సంస్థల ఉమ్మడి వాటా స్థిరంగా పెరుగుతూ 60 శాతానికి పైగా దాటడం విశేషం.
ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు అమ్మాయంటే?
సెప్టెంబర్ నెలలోని మొదటి 28 రోజుల వ్యవధిలోనే టీవీఎస్ మోటార్ రికార్డు స్థాయిలో 49,677 ఎలక్ట్రిక్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించింది. బజాజ్ ఆటో 44,480 యూనిట్లతో బలమైన పోటీని ఇచ్చింది. మరోవైపు అథర్ ఎనర్జీ 27,690 యూనిట్లు, హీరో విడా 22,109 యూనిట్లను విక్రయించాయి. గతంలో మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యం వహించిన ఓలా ఎలక్ట్రిక్ కేవలం 11,984 యూనిట్లకు మాత్రమే పరిమితమై, సెప్టెంబర్‌లో తన మార్కెట్ వాటాను 6.4 శాతానికి కోల్పోయింది. మిగిలిన ఆంపియర్, రివర్, ఆల్ట్రావైలెట్ వంటి ఇతర చిన్న కంపెనీలన్నీ కలిసి 32,000 కంటే ఎక్కువ యూనిట్లను కస్టమర్లకు అందించాయి.
సరికొత్త వ్యూహాలతో వస్తున్న ఏథర్
భారత ఈవీ రంగాన్ని ఏలిన ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ షేర్ గత కొద్ది నెలలుగా విపరీతంగా క్షీణిస్తూ వస్తోంది. జూలైలో 6.9 శాతం, ఆగస్టులో 7.6 శాతంగా ఉన్న ఓలా వాటా, సెప్టెంబర్‌కి వచ్చేసరికి 6.4 శాతానికి పడిపోయింది. సర్వీసింగ్ సమస్యలు, నాణ్యతా లోపాలు ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అథర్ ఎనర్జీ మార్కెట్‌లో మళ్లీ పుంజుకోవడానికి రూ.99,000 ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో 'కొనార్క్' అనే సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని విక్రయాలు సెప్టెంబర్ చివర్లో ప్రారంభం కావడంతో, ఆ ప్రభావం అక్టోబర్ ఫలితాల్లో స్పష్టంగా కనిపించే అవకాశముంది.
దేశవ్యాప్త నెట్‌వర్క్, సర్వీస్ సౌకర్యాలే ప్లస్ పాయింట్
ప్రారంభంలో ప్యూర్ ఈవీ కంపెనీలు మాత్రమే ఆధిపత్యం చలాయించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. టీవీఎస్, బజాజ్, హీరో వంటి సీనియర్ ఆటోమొబైల్ కంపెనీలకు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది షోరూమ్‌లు, విశాలమైన సర్వీస్ నెట్‌వర్క్ పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. వాహనానికి ఏ చిన్న సమస్య వచ్చినా స్థానికంగా వెంటనే సర్వీసింగ్ లభించడం, విడిభాగాల లభ్యత సులభంగా ఉండటంతో కస్టమర్లు పాత బ్రాండ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1.88 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు రిజిస్టర్ కావడం చూస్తుంటే, పండుగల సీజన్‌లో ఈవీ విక్రయాలు మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

