TVS iQube : రోజుకు రూ.3ఖర్చుతో 145కిమీ రేంజ్.. రికార్డు క్రియేట్ చేస్తున్న టీవీఎస్ ఐక్యూబ్
రికార్డు క్రియేట్ చేస్తున్న టీవీఎస్ ఐక్యూబ్

TVS iQube : టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ ఈవీ టూ-వీలర్ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ స్కూటర్ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. కంపెనీ ఇందులో కొత్త వేరియంట్‌లను కూడా చేర్చడం ద్వారా ఇది వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ, ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, ఐక్యూబ్ బ్యాటరీ ఖర్చు కూడా చాలా ఎక్కువ.
ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.95,372 కాగా, కొత్త బ్యాటరీ ప్యాక్ ధరలు వినియోగదారులకు పెద్ద భారం. నివేదికల ప్రకారం 2.2 kWh, 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌ల ధరలు రూ.60,000 నుంచి రూ.70,000 వరకు ఉన్నాయి. ఇక టాప్-ఎండ్ iQube ST మోడల్ బ్యాటరీ ప్యాక్ ధర ఏకంగా రూ.90,000 వరకు ఉంది. కంపెనీ బ్యాటరీపై వారంటీ ఇస్తున్నప్పటికీ, ఫిజికల్ డ్యామేజ్ అయినప్పుడు ఈ వారంటీ వర్తించదు.
టీవీఎస్ మోటార్స్ తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా వినియోగదారులు ఎంత ఆదా చేసుకోవచ్చో వివరించింది. పెట్రోల్ స్కూటర్లలో 50,000 కి.మీ ప్రయాణించడానికి సుమారు రూ.లక్ష ఖర్చవుతుంది. కానీ, ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో 50,000 కి.మీ ప్రయాణించడానికి అయ్యే ఖర్చు కేవలం రూ.6,466 మాత్రమే. దీని ద్వారా సర్వీస్, మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు దాదాపు రూ.93,500 ఆదా అవుతుంది.
ఐక్యూబ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.19. ఐక్యూబ్ ST మోడల్ కేవలం 4 గంటల 6 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్‌పై 145 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మీరు రోజుకు 30 కి.మీ ప్రయాణించినట్లయితే వారానికి రెండుసార్లు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రెండుసార్లు ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.37.50 మాత్రమే. అంటే, నెలవారీ ఖర్చు సగటున రూ.150 మాత్రమే. ఈ లెక్కన ఐక్యూబ్‌తో రోజుకు రూ.3 ఖర్చుతో 30 కి.మీ ప్రయాణం చేయవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం iQube, iQube S, iQube ST అనే మూడు వేరియంట్‌లలో 2.2 kWh, 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఈ స్కూటర్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, క్లీన్ UI, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్‌సెట్, మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, OTA (Over-The-Air) అప్‌డేట్స్ ఉన్నాయి. ప్లగ్-అండ్-ప్లే క్యారీతో కూడిన ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ మరియు క్లౌడ్ కనెక్టివిటీ ఆప్షన్లు, 32 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.

