TVS iQube: కేవలం రూ.42తోనే 212 కిమీ ప్రయాణం.. మార్కెట్లో రూ.60 వేలకే కలల స్కూటర్
మార్కెట్లో రూ.60 వేలకే కలల స్కూటర్

TVS iQube: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో టీవీఎస్ మోటార్స్ తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. జులై నెలలో ఏకంగా 158 శాతం అమ్మకాల వృద్ధితో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్ ఫీచర్లు, ధరల వివరాలు ఇవే. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. జులై నెలలో కంపెనీ ఏకంగా 59,386 ఐక్యూబ్ స్కూటర్లను విక్రయించింది. గత ఏడాది జులైలో అమ్ముడైన 23,029 యూనిట్లతో పోలిస్తే అమ్మకాల్లో ఏకంగా 158 శాతం పెరుగుదల నమోదు కావడం విశేషం. జూన్ నెల అమ్మకాలతో పోల్చినా జులైలో 25 శాతం వృద్ధి కనిపించింది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటమే కస్టమర్లు వీటివైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణం.
రూ.59,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి
వినియోగదారుల బడ్జెట్‌కు అనుగుణంగా టీవీఎస్ ఐక్యూబ్‌ను విభిన్న బ్యాటరీ సామర్థ్యాలతో కంపెనీ అందిస్తోంది. 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (BaaS) ఆప్షన్‌తో ఐక్యూబ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,999గా ఉంది. సాధారణ మోడళ్ల విషయానికి వస్తే, 2.3kWh బ్యాటరీ మోడల్ ధర రూ.94,434 నుంచి ప్రారంభమవుతుంది. 3.1kWh వేరియంట్ ధర రూ.లక్ష కాగా, 3.5kWh మోడల్ ధర రూ. 1,08,993గా నిర్ణయించారు. వీటితో పాటు 4.7kWh బ్యాటరీ ఉన్న ఐక్యూబ్ S మోడల్ ధర రూ.1,17,642 గానూ, టాప్ వేరియంట్ అయిన 5.3kWh బ్యాటరీ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,58,834 గానూ అందుబాటులో ఉన్నాయి.
కేవలం రూ.42 తోనే 212 కిలోమీటర్ల ప్రయాణం
ఈ స్కూటర్ ఆఫర్ చేసే మైలేజ్ లేదా రేంజ్ విషయానికి వస్తే, మోడల్‌ను బట్టి మైలేజ్ మారుతుంది. 2.3kWh వర్షన్ ఒకసారి ఛార్జ్ చేస్తే 114 కిలోమీటర్లు, 3.1kWh వర్షన్ 123 కిలోమీటర్లు, 3.5kWh మోడల్ 145 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 4.7kWh మోడల్ 175 కిలోమీటర్లు ప్రయాణించగా, టాప్ మోడల్ 5.3kWh బ్యాటరీ వర్షన్ ఏకంగా 212 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ పెద్ద బ్యాటరీని ఇంట్లో ఛార్జ్ చేయడానికి దాదాపు 6 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ విద్యుత్ ధర రూ. 7 చొప్పున లెక్కిస్తే, కేవలం రూ. 42 ఖర్చుతోనే 212 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ అందిస్తున్న భారీ రేంజ్, తక్కువ ఛార్జింగ్ ఖర్చులు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా మారుస్తున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ భారం నుంచి ఉపశమనం పొందడానికి ఈ తరహా వాహనాలే ప్రధాన మార్గం కానున్నాయి.

