టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

TVS : ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి టీవీఎస్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌తో వస్తోంది. ఇటీవల టీవీఎస్ తమ రాబోయే TVS M1-S ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ సింగపూర్‌కు చెందిన ఐఓఎన్ మొబిలిటీ స్టార్టప్‌తో కలిసి తయారు చేసిన ఐఓఎన్ ఎం1-ఎస్ మోడల్‌కు రీ-బ్రాండెడ్ వెర్షన్. ఈ స్కూటర్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లు, 150 కిలోమీటర్ల రేంజ్ ఉండవచ్చని అంచనా.

గాడివాడి అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఈ టీవీఎస్ ఎం1-ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని తెలుస్తోంది. ఈ స్కూటర్‌లో 3.5 kWh నుండి 5.5 kWh వరకు వివిధ బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. దీనిలో 4.3 kWh బ్యాటరీని కేవలం మూడు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని సమాచారం.

టీవీఎస్ ఎం1-ఎస్ స్కూటర్‌లో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల కలర్ డిస్‌ప్లే ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లతో వస్తుంది. రివర్స్ మోడ్, రైడింగ్ మోడ్స్ , ట్విన్ LED హెడ్‌లైట్స్, కీలెస్ ఆపరేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి. ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక డ్యూయల్ షాకర్లు ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

ఈ స్కూటర్‌లో 12.5 kW పీక్ అవుట్‌పుట్ గల పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 45Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సహాయంతో స్కూటర్ కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 50 కి.మీ./గంట వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 105 కి.మీ./గంటగా ఉండవచ్చు.

ఈ టీవీఎస్ ఎం1-ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదట ఇండోనేషియాలో లాంచ్ కానుంది. ఆ తర్వాత ఇది భారత మార్కెట్‌లోకి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, భారత ఈవీ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, టీవీఎస్ ఈ స్కూటర్‌ను భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story