Ultraviolette Tesseract : 70 వేల మంది కస్టమర్లకు భారీ షాక్.. ఇండియాలో అల్ట్రావయొలెట్ టెస్సరాక్ట్ లాంచ్ వాయిదా
ఇండియాలో అల్ట్రావయొలెట్ టెస్సరాక్ట్ లాంచ్ వాయిదా

Ultraviolette Tesseract : సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్‌లతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ కంపెనీ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్, తమ కస్టమర్లకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తమ సరికొత్త విప్లవాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్ అల్ట్రావయొలెట్ టెస్సరాక్ట్ లాంచ్‌ను కంపెనీ అధికారికంగా వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ సూపర్‌కార్ తరహా డిజైన్ ఉన్న మ్యాక్సీ ఈ-స్కూటర్ 2026 రెండవ త్రైమాసికంలో మార్కెట్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల దీని విడుదలను మరికొన్ని నెలల పాటు ముందుకు జరుపుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఈ మోడల్ జనవరి 2027 లో గ్రాండ్‌గా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో ఈ క్రేజీ స్కూటర్ కోసం వేచి చూస్తున్న వేలాది మంది అభిమానులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు.
ఈ వాయిదా వెనుక కస్టమర్లకు మరింత మెరుగైన, అత్యంత శక్తివంతమైన వాహనాన్ని అందించాలనే కంపెనీ ఆలోచన దాగి ఉంది. స్కూటర్ లోపలి సాంకేతికతలో అల్ట్రావయొలెట్ ఒక భారీ మార్పును చేపట్టింది. ఈ స్కూటర్‌ను ఇప్పుడు సరికొత్త 100-వోల్ట్ (100V) ఆర్కిటెక్చర్ టెక్నాలజీపై రీ-డిజైన్ చేస్తున్నారు. ఈ అధునాతన సాంకేతికత వల్ల స్కూటర్ పవర్ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుందని, ఎక్కువ బరువును సులభంగా మోయగలదని కంపెనీ తెలిపింది. అలాగే హై-స్పీడ్ పర్ఫార్మెన్స్ మునుపటి కంటే చాలా స్మూత్‌గా మారుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ అదనపు సమయాన్ని స్కూటర్‌ను మరింత పవర్‌ఫుల్ రాకెట్‌లా మార్చడానికి కంపెనీ ఉపయోగించుకుంటోంది.
గతేడాది ఈ సరికొత్త మ్యాక్సీ-స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు.. దీని లుక్స్ చూసి ఆటోమొబైల్ రంగామే ఆశ్చర్యపోయింది. ఇది చూడటానికి సాధారణ స్కూటర్‌లా కాకుండా, ఒక రేసింగ్ స్పోర్ట్స్ బైక్‌ను తలపిస్తుంది. అందుకే దీని అంచనా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షలుగా తెలియగానే కస్టమర్లు బుకింగ్స్ కోసం ఎగబడ్డారు. ఇప్పటివరకు ఏకంగా 70,000 మందికి పైగా ఈ స్కూటర్‌ను బుక్ చేసుకుని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కంపెనీ దావా ప్రకారం, ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 261 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్‌ను ఇస్తుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లుగా ఉండబోతోంది. ఇది బడ్జెట్ ధరలో అత్యంత వేగవంతమైన లగ్జరీ స్కూటర్ కానుంది.
భారతదేశంలోని గతుకుల రోడ్లు, విపరీతమైన ఎండలు, వానాకాలం వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా ఈ స్కూటర్‌ను విభిన్న ప్రాంతాలలో కఠినమైన టెస్టింగ్‌కు గురిచేస్తున్నారు. ఈ సందర్భంగా అల్ట్రావయొలెట్ సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఈ స్కూటర్ తాము మొదట అనుకున్న ఊహల కంటే చాలా అద్భుతంగా, సరికొత్త అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు. కంపెనీ సీటీఓ నీరజ్ రాజ్‌మోహన్ మాట్లాడుతూ.. కొత్త 100V టెక్నాలజీ వల్ల బ్యాటరీ లైఫ్ పెరగడమే కాకుండా, తక్కువ ఛార్జింగ్‌తోనే ఎక్కువ రేంజ్ ఇచ్చేలా స్కూటర్ సామర్థ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేశారు.

