Ultraviolette : 323 కి.మీ. రేంజ్, 145 కి.మీ. టాప్ స్పీడ్... ఈ బైక్ తోటి కిక్కే వేరప్పా!
ఈ బైక్ తోటి కిక్కే వేరప్పా!

Ultraviolette : భారతీయ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ అల్ట్రావైలెట్ మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. దాని పేరు అల్ట్రావైలెట్ X47. ఇది ఒక ఎలక్ట్రిక్ అడ్వెంచర్ టూరర్ మోడల్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, ఈ ధర కేవలం మొదటి 1,000 మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ బైక్ బుకింగ్స్ సెప్టెంబర్ 23నే ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల నుంచి డెలివరీలు మొదలవుతాయి. కొత్తగా లాంచ్ అయిన ఈ మోడల్ చాలా పవర్‌ఫుల్, అడ్వెంచర్-స్టైల్ డిజైన్‌తో రూపొందించబడింది. ఇందులో సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్ ఉంటుంది. త్రిభుజాకారపు హెడ్‌ల్యాంప్, షార్ప్ ఫ్రంట్ బీక్, టూరింగ్ విండ్‌స్క్రీన్, రెండు వైపులా ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు దీనికి అదనపు ఆకర్షణలు. బ్యాటరీ ప్యాక్ కింద భాగంలో అమర్చారు. దానికి కంప్లీట్ సేఫ్టీ కల్పించారు.
అల్ట్రావైలెట్ X47 బైక్ మొత్తం రెండు వేర్వేరు మోడల్స్‌లో లభిస్తుంది. క్రాసోవర్ బుకింగ్ అమౌంట్ రూ. 999. ఇది టర్బో రెడ్, కాస్మిక్ బ్లాక్, స్టెల్లార్ వైట్ అనే మూడు రంగులలో లభిస్తుంది. డెసర్ట్ వింగ్ స్పెషల్ ఎడిషన్ లేత పసుపు రంగులో వస్తుంది. ఇందులో టీపీఎంఎస్, హ్యాండ్‌గార్డ్స్, డాష్‌క్యామ్ వంటి ఫీచర్లు అదనంగా ఉంటాయి. దీని బుకింగ్ అమౌంట్ రూ. 4,999. అయితే, దీని ధర ఇంకా నిర్ణయించలేదు.
ఈ బైక్‌లో అల్ట్రావైలెట్ F77 బ్యాటరీ, టెక్నాలజీని వాడారు. X47 కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్లో 7.1 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 263 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. రీకాన్ టాప్ వేరియంట్లో 10.3 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకే ఛార్జింగ్‌తో 323 కి.మీల రేంజ్ ఇస్తుంది. ఇందులో 30 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, అది వెనుక వీల్‌కి 610 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ./గంట వేగాన్ని చేరుకుంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం 145 కి.మీ./గంట. మార్కెట్లో ఇది త్వరలో రాబోతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఈ బైక్‌లో ముందు, వెనుక వైపు ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్ ఉన్నాయి. ఇవి నిరంతరంగా వీడియో రికార్డింగ్ చేస్తాయి. అలాగే, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్, డ్యూయల్-ఛానెల్ ఏబీఎస్, తొమ్మిది లెవెల్స్ రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉన్నాయి. బ్రేకింగ్ సమయంలో స్టెబిలిటీని కాపాడటానికి ఏబీఎస్, రీజెనరేషన్ మధ్య సమన్వయ వ్యవస్థను కూడా ఇచ్చారు. అలాగే, కనెక్టెడ్ యాప్ ద్వారా బైక్ గురించి పూర్తి సమాచారం, రైడింగ్ డేటా, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్ పొందవచ్చు.
