Car Launches: కొత్త బాలెనో నుంచి కియా సోరెంటో వరకు.. మార్కెట్‌లోకి వస్తున్న 4 సూపర్ కార్లు
మార్కెట్‌లోకి వస్తున్న 4 సూపర్ కార్లు

Car Launches: పండుగల సీజన్ ముంగిట దేశీయ ఆటోమొబైల్ రంగానికి సరికొత్త కళ వచ్చింది. ఆగస్టు నెల లాంచ్‌లతో హడావుడిగా గడిచిపోగా, సెప్టెంబర్ నెలలోనూ ప్రముఖ వాహన తయారీ సంస్థలు సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి దించడానికి సిద్ధమయ్యాయి. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల వరకు ఈ నెలలో రోడ్డెక్కనున్న ఆ 4 మోడళ్ల విశేషాలు ఇప్పుడు చూద్దాం.
కియా సోరెంటో (లాంచ్ తేదీ: సెప్టెంబర్ 4)
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ సోరెంటోను భారత మార్కెట్లో సెప్టెంబర్ 4న అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ కారు పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్, టర్బో డిజైన్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ 238 హెచ్‌పి పవర్, 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.0 లీటర్ డిజైన్ ఇంజిన్ 202 హెచ్‌పి పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6 సీట్లు, 7 సీట్ల అమరికలతో వస్తున్న ఈ కారు కోసం కియా సంస్థ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది.
మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (లాంచ్ తేదీ: సెప్టెంబర్ 5)
సామాన్య వాహన ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ సెప్టెంబర్ 5న మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. 2022లో వచ్చిన రెండవ తరం బలేనోకు ఇది సరికొత్త అప్‌డేట్ వర్షన్. ముందు భాగంలో సరికొత్త గ్రిల్, ఎల్ఈడీ డిజైన్‌తో పాటు లోపలి కేబిన్‌లోనూ సరికొత్త ఫీచర్లను అందించనున్నారు. ఇంజిన్ పరంగా మార్పులు లేకపోయినా, ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (90 హెచ్‌పి) కొనసాగుతుంది. సిఎన్‌జి వేరియంట్ 77.5 హెచ్‌పి పవర్‌తో కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించనుంది.
బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఐ7 అప్‌డేటెడ్ వర్షన్ (లాంచ్ తేదీ: సెప్టెంబర్ 11)
లగ్జరీ కార్లను ఇష్టపడే వారి కోసం జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ సెప్టెంబర్ 11న అప్‌డేటెడ్ 7 సిరీస్, ఐ7 మోడళ్లను భారత్‌కు తీసుకువస్తోంది. 7 సిరీస్ మోడల్ పెట్రోల్, డిజైన్ ఇంజిన్ ఆప్షన్లలో రానుండగా, ఐ7 మోడల్ పూర్తి ఎలక్ట్రిక్ వర్షన్‌గా లభిస్తుంది. పెట్రోల్ వర్షన్ 740ఐ లోని 3.0 లీటర్ 6-సిలిండర్ ఇంజిన్ 400 హెచ్‌పి పవర్ ఇవ్వగా, డిజైన్ వర్షన్ 740డి మోడల్ 313 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. రెండింటిలోనూ 48వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి.
పోర్షే కయాన్ ఎలక్ట్రిక్ (లాంచ్ తేదీ: సెప్టెంబర్ 30)
ఎలక్ట్రిక్ సూపర్ కార్ ప్రియులను అలరించేందుకు పోర్షే తన కయాన్ ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 30న ఆవిష్కరించనుంది. సాధారణ వర్షన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.77 కోట్లు కాగా, కయాన్ టర్బో ఎలక్ట్రిక్ ధర రూ. 2.27 కోట్లుగా నిర్ణయించారు. రెండింటిలోనూ 113 కిలోవాట్ అవర్ బ్యాటరీ, డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. టర్బో ఎలక్ట్రిక్ మోడల్ లాంచ్ కంట్రోల్‌తో ఏకంగా 1,156 హెచ్‌పి పవర్, 1,500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కేవలం 2.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 537 కిలోమీటర్ల పరిధి ప్రయాణిస్తుంది.

