Upcoming Electric Cars : మరో ఆరు నెలల్లో రాబోతున్న 5 అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీలు ఇవే
5 అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీలు ఇవే

Upcoming Electric Cars : భారత మార్కెట్లో పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆటోమొబైల్ కంపెనీలు సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల కానున్నాయి. మార్కెట్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి మహీంద్రా, మారుతి సుజుకి, విన్‌ఫాస్ట్ వంటి పెద్ద బ్రాండ్‌లు తమ కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో భారత రోడ్లపై సందడి చేయనున్న ఆ 5 అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.
విన్‌ఫాస్ట్ వీఎఫ్ 6, వీఎఫ్ 7
విన్‌ఫాస్ట్ తమిళనాడులోని తమ ప్లాంట్‌లో వీఎఫ్ 6, వీఎఫ్ 7 మోడళ్ల అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. ఈ ఎస్‌యూవీలు ఒకే ఛార్జింగ్‌తో 480 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తాయని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఈ మోడళ్లకు బుకింగ్‌లను తీసుకోవడం ప్రారంభించింది. ఈ రెండు ఎస్‌యూవీలు అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీతో వస్తున్నాయి.
మారుతి సుజుకి ఈ-విటారా
మారుతి సుజుకి తమ ఈ-విటారా కారును త్వరలో విడుదల చేయనుంది. ఈ కారు ఉత్పత్తి గుజరాత్ ప్లాంట్‌లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం జరుగుతోంది. 2026 ప్రారంభంలో ఈ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల అవుతుందని అంచనా. ఈ ఎస్‌యూవీ డెల్టా, జీటా, ఆల్ఫా వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు 61.1 kWh, 48.8 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుందని, ఒకే ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
మహీంద్రా ఎక్స్ఈవీ 7e, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ
మహీంద్రా తన మొదటి త్రీ-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 7eను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది XUV.e8 కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేయబడింది. ఇందులో ఎక్స్‌యూవీ700 లో ఉన్న ట్రిపుల్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా, ఇందులో ఎక్స్ఈవీ 9e, బీఈ 6 మోడళ్లలో ఉన్న బ్యాటరీ ఆప్షన్స్ ఉండవచ్చు. దీనితో పాటు, XUV 3XO EV కూడా పరీక్షల దశలో ఉంది. ఈ రెండు కార్లు 2026 మొదటి అర్ధభాగంలో విడుదల కావచ్చు.
