Used Car Buying Guide : పాత కారు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మునిగిపోవడం ఖాయం
ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మునిగిపోవడం ఖాయం

Used Car Buying Guide : 2026లో కొత్త కార్ల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో చాలా మంది చూపు పాత కార్ల వైపు మళ్లుతోంది. సెకండ్ హ్యాండ్ కారు కొనడం అనేది ఆర్థికంగా మంచి నిర్ణయమే అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. పాత కారును కొనే ముందు కేవలం బాహ్య రూపాన్ని చూసి మోసపోకుండా, లోపల ఇంజిన్ కండిషన్ నుంచి పేపర్ల వరకు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. మీరు మోసపోకుండా ఒక మంచి కారును ఎంచుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
బడ్జెట్ అంటే కేవలం కారు ధర మాత్రమే కాదు
సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకున్నప్పుడు మొదట ఒక బడ్జెట్ అనుకోవాలి. అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. బడ్జెట్ అంటే కేవలం కారు యజమానికి ఇచ్చే డబ్బు మాత్రమే కాదు. కారు కొన్న తర్వాత దాని పేరు మార్పిడి, ఇన్సూరెన్స్ ప్రీమియం, చిన్నపాటి సర్వీసింగ్, టైర్లు లేదా సీట్ కవర్ల వంటి అదనపు ఖర్చులను కూడా లెక్కలో వేసుకోవాలి. సాధారణంగా కారు ధరపై మరో 10 నుంచి 15 శాతం అదనపు ఖర్చులకు సిద్ధంగా ఉండటం మంచిది. అప్పుడే మీ జేబుకు చిల్లు పడకుండా ప్లాన్ చేసుకోగలరు.
మీ అవసరానికి తగ్గ కారును ఎంచుకోండి
ప్రతి ఒక్కరి అవసరం ఒకేలా ఉండదు. మీరు కారును కేవలం సిటీలో ఆఫీసుకి వెళ్లడానికి వాడుతారా? లేక కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్పులు వేస్తారా? అనేది ముందే తేల్చుకోండి. సిటీ డ్రైవింగ్ అయితే మైలేజ్ ఇచ్చే చిన్న కార్లు లేదా ఎలక్ట్రిక్ కార్లు ఉత్తమం. అదే హైవే ప్రయాణాలకైతే సేఫ్టీ, కంఫర్ట్ ఉన్న ఎస్‌యూవీలు బాగుంటాయి. అలాగే పెట్రోల్, డీజిల్, సిఎన్జీ లేదా ఎలక్ట్రిక్.. వీటిలో మీకు ఏది లాభదాయకమో లెక్క వేసుకోండి. గేర్ మార్చే ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆటోమేటిక్ కార్లను పరిశీలించవచ్చు.
రీసేల్ వాల్యూ, విడిభాగాల లభ్యత
కారు మోడల్‌ను ఖరారు చేసే ముందు మార్కెట్లో ఆ కారుకు ఉన్న డిమాండ్ ఏంటో తెలుసుకోండి. భవిష్యత్తులో మీరు ఆ కారును అమ్మాలనుకున్నప్పుడు మంచి ధర రావాలి అంటే రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉన్న బ్రాండ్లను ఎంచుకోవడం మేలు. అలాగే, ఆ కారు విడిభాగాలు సులభంగా దొరుకుతాయా లేదా? వాటి ధరలు ఎలా ఉన్నాయి? అనేది కూడా ముఖ్యం. కొన్ని విదేశీ బ్రాండ్ల పాత కార్లు తక్కువ ధరకే దొరికినప్పటికీ, వాటి రిపేర్ ఖర్చులు భరించడం కష్టమవుతుంది. కాబట్టి సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్న కార్లకే ప్రాధాన్యత ఇవ్వండి.
మెకానిక్ పరీక్ష, టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి
కారు చూడటానికి మెరిసిపోతున్నంత మాత్రాన అది మంచి కారు అని అనుకోకండి. మీకు నమ్మకమైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లి ఇంజిన్, గేర్ బాక్స్, సస్పెన్షన్, బ్రేకులను తనిఖీ చేయించండి. కారు బాడీపై ఎక్కడైనా తుప్పు పట్టిందా లేదా యాక్సిడెంట్ జరిగి రంగు వేశారా అనేది క్షుణ్ణంగా చూడాలి. అన్నీ బాగున్నాయి అనుకున్నాక కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేయండి. ఏవైనా వింత శబ్దాలు వస్తున్నాయా, క్లచ్ హార్డ్ గా ఉందా లేదా స్టీరింగ్ వైబ్రేట్ అవుతుందా అనేది గమనించండి.
వెహికల్ హిస్టరీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్
కారు కొనే ముందు దాని గతాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కారుకు ఏవైనా ప్రమాదాలు జరిగాయా? ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా? అనేది ఇన్సూరెన్స్ పేపర్ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆర్సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికేట్, సర్వీస్ హిస్టరీ బుక్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. కారుపై ఏవైనా పెండింగ్ చలాన్లు లేదా లోన్ బకాయిలు ఉన్నాయేమో ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకోండి. అన్ని పేపర్లు పక్కాగా ఉంటేనే డీల్ ఓకే చేయండి. ఆన్‌లైన్ టూల్స్ ద్వారా ఆ కారు మోడల్‌కు మార్కెట్లో ఉన్న ప్రస్తుత ధరను పోల్చి చూసి బేరమాడండి.

