Used Car Buying Tips : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి
ఈ తప్పులు అస్సలు చేయకండి

Used Car Buying Tips : కొత్త కారు కొనడం అనేది ఈ రోజుల్లో సామాన్యుడికి ఒక కలగానే మారుతోంది. కార్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, చాలామంది చూపు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మళ్లుతోంది. 2025లో జీఎస్టీ 2.0 వల్ల కొత్త కార్ల ధరల్లో స్వల్ప మార్పులు వచ్చినప్పటికీ, తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ అనుభూతిని పొందడానికి పాత కార్లే బెస్ట్ ఆప్షన్ అని వాహన ప్రియులు భావిస్తున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చిన్న పొరపాటు చేసినా మీ సొమ్ము గంగలో పోసినట్లే. అందుకే, తెలివిగా కారు కొని లక్షల రూపాయలు ఎలా ఆదా చేయాలో తెలుసుకుందాం.
పాత కారు కొనాలంటే ఇప్పుడు వీధి చివర బ్రోకర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. Cars24 వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొన్ని కార్లపై రూ. 1.8 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇక్కడ మీకు వారంటీతో పాటు సులభమైన ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే Spinny లో తక్కువ వడ్డీ రేటుకే ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. మారుతి సుజుకికి చెందిన True Value, మహీంద్రా First Choice వంటి సంస్థలు కారు కండిషన్‌ను వందల రకాలుగా పరీక్షించి అమ్ముతాయి కాబట్టి అక్కడ మోసపోయే అవకాశం చాలా తక్కువ.
కారు చూడటానికి అద్దంలా మెరుస్తున్నంత మాత్రాన అది కండిషన్‌లో ఉన్నట్లు కాదు. ముందుగా మీ బడ్జెట్ ఎంతో నిర్ణయించుకోండి. ఆ తర్వాత కారు సర్వీస్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించండి. కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, గతంలో యాక్సిడెంట్లు ఏమైనా అయ్యాయా? అనేది తెలుసుకోవాలి. ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఇంజిన్ సౌండ్, బ్రేకులు, క్లచ్, సస్పెన్షన్‌ను గమనించండి. మీకు పెద్దగా అవగాహన లేకపోతే, ఒక నమ్మకమైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో వచ్చే భారీ రిపేర్ ఖర్చులను ముందే ఆదా చేసుకోవచ్చు.
కారు కండిషన్ ఎంత బాగున్నా.. పేపర్ వర్క్ సరిగ్గా లేకపోతే అది మీకు తలనోప్పిగా మారుతుంది. ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకోండి. ఇన్సూరెన్స్ మీ పేరు మీదకు మార్చుకోవడం, మునుపటి యజమాని ట్రాఫిక్ చలాన్లు ఏమైనా బాకీ ఉన్నారా అనేది నో డ్యూస్ సర్టిఫికేట్ ద్వారా చెక్ చేయాలి. ఒకవేళ ఆ కారు గతంలో లోన్ మీద కొని ఉంటే, బ్యాంక్ నుండి ఎన్‌ఓసీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే కొత్త కారు కంటే మెరుగైన వాహనాన్ని సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.

