VinFast : టాటా, మహీంద్రా, హ్యుందాయ్‌లకు షాక్..విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్స్ షురూ
విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్స్ షురూ

VinFast : వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ విన్‌ఫాస్ట్, భారత మార్కెట్‌లోకి తమ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలైన వీఎఫ్6, వీఎఫ్7 కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ.21,000 టోకెన్ డబ్బు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. ఈ రెండు కార్లు వచ్చే ఆగస్టు నెలలో అధికారికంగా లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలను తమిళనాడులోని తూత్తుకుడిలో నిర్మిస్తున్న విన్‌ఫాస్ట్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తారు.
తక్కువ ధరలో లభించే మోడల్ వీఎఫ్6 . ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి కార్లకు పోటీ ఇవ్వనుంది. వీఎఫ్7 ప్రీమియం మోడల్. ఇది మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ, బైడీ అట్టో 3 వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది. వీఎఫ్6 రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఎకో వేరియంట్ 178 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 399 కి.మీల రేంజ్ ఇస్తుంది. ప్లస్ వేరియంట్ 204 బీహెచ్‌పీ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ 381 కి.మీ. ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లలో 59.6 kWh బ్యాటరీ ఉంటుంది.
వీఎఫ్7లో పెద్ద 75.3 kWh బ్యాటరీని అమర్చారు. ఎకో 204 బీహెచ్‌పీ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 450 కి.మీల రేంజ్ ఇస్తుంది. ప్లస్ వేరియంట్లో డ్యూయల్ మోటార్, మరింత శక్తివంతమైన ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఇది 354 బీహెచ్‌పీ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ 431 కి.మీ. ఉంటుంది.
విన్‌ఫాస్ట్ 13 డీలర్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో 27 నగరాల్లో 32 డీలర్‌షిప్‌లను తెరవాలని యోచిస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, జైపూర్, అహ్మదాబాద్, కోల్‌కతా, కొచ్చిన్, భువనేశ్వర్, తిరువనంతపురం, చండీగఢ్, లక్నో, కోయంబత్తూర్, సూరత్, కోజికోడ్, విశాఖపట్నం, విజయవాడ, సిమ్లా, ఆగ్రా, ఝాన్సీ, గ్వాలియర్, వాపి, వడోదర, గోవా వంటి నగరాలు ఇందులో ఉన్నాయి. ఛార్జింగ్, సర్వీస్ కోసం రోడ్‌గ్రిడ్, మైటీవీఎస్, గ్లోబల్ అష్యూర్ వంటి కంపెనీలతో విన్‌ఫాస్ట్ చేతులు కలిపింది.
