VinFast: 160 కిమీ రేంజ్, అదిరిపోయే స్పోర్టీ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న కొత్త ఈవీలు
కొత్త ఈవీలు

VinFast: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశంలో VF6, VF7 వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ, తాజాగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్, ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డిజైన్లకు సంబంధించి భారత్‌లో పేటెంట్ దాఖలు చేసింది. దీనివల్ల త్వరలోనే దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది. విన్‌ఫాస్ట్ ఎంట్రీతో ఇప్పటికే మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
వెంటో ఎస్ స్ఫూర్తితో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్
పేటెంట్ చిత్రాల ప్రకారం విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన వెంటో ఎస్ మోడల్‌ను పోలి ఉంది. సాధారణంగా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లలో మోటార్ వెనుక చక్రం లోపల ఉంటుంది. కానీ ఈ కొత్త స్కూటర్లో సైడ్-మౌంటెడ్ మోటార్ అందించడం విశేషం. దీనివల్ల స్కూటర్ వెనుక భాగంలో సస్పెన్షన్ పనితీరు మెరుగుపడటంతో పాటు డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. నగర ప్రయాణాలకు అనుగుణంగా ఆధునిక లుక్‌తో దీన్ని తీర్చిదిద్దారు.
స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ బైక్
కంపెనీ దాఖలు చేసిన రెండో పేటెంట్ ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించినది. దీని డిజైన్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్, హెవీ మోటార్ కోసం విశాలమైన స్థలం కనిపిస్తోంది. వెడల్పాటి టైర్లు, స్పోర్టీ రైడింగ్ పొజిషన్ ఈ బైక్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. విన్‌ఫాస్ట్ గతంలో చూపించిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ఆధారంగా భవిష్యత్తులో స్ట్రీట్-నేకెడ్, క్రూజర్, స్పోర్ట్స్ బైక్ వంటి విభిన్న మోడళ్లను మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
160 కిలోమీటర్ల రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే?
భారత్‌లో ఈ రెండు వాహనాలు ఎప్పుడు విడుదలవుతాయి, వాటి ధర ఎంత ఉంటుందనే విషయాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే వియత్నాంలో విక్రయించే పాత వెంటో ఎస్ మోడల్ వివరాలను పరిశీలిస్తే.. అందులో 3.5kWh బ్యాటరీ, 5.2kW మోటార్ ఇచ్చారు. అది గంటకు 89 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పాటు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వీటిలో మరిన్ని మార్పులు చేసి త్వరలోనే మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

