VinFast : విన్ ఫాస్ట్ ఇండియాలో సంచలనం.. కార్ల సర్వీసింగ్ కోసం కాస్ట్రాల్తో ఒప్పందం
కార్ల సర్వీసింగ్ కోసం కాస్ట్రాల్తో ఒప్పందం

VinFast :ఈవీ మార్కెట్‌లో వేగంగా దూసుకుపోతున్న విన్ ఫాస్ట్ ఇప్పుడు భారతదేశంలో తమ ఆఫ్టర్‌సేల్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి ఒక కీలక అడుగు వేసింది. ప్రీమియం లూబ్రికెంట్ తయారీదారు అయిన కాస్ట్రాల్ ఇండియాలో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా తమ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండే ఆఫ్టర్‌సేల్స్ మద్దతు అందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఇది భారతదేశంలో ఈవీ యజమానుల కోసం ఒక స్ట్రాంగ్ సర్వీస్ నెట్ వర్క్ నిర్మించాలనే విన్ ఫాస్ట్ విజన్‌ను మరింత బలోపేతం చేస్తుంది.
ఈ ఒప్పందం కింద కాస్ట్రాల్ ఇండియా తన దేశవ్యాప్తంగా 300కు పైగా నగరాల్లో విస్తరించి ఉన్న 750కి పైగా అవుట్‌లెట్‌లలోని కొన్ని కాస్ట్రాల్ ఆటో సర్వీస్ వర్క్‌షాప్‌లను విన్ ఫాస్ట్ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ సర్వీస్ సెంటర్లలో విన్ ఫ్టాస్ట్-బ్రాండెడ్ బెలు, ఈవీ టెక్నీషియన్లు, ఒరిజినల్ విన్ ఫాస్ట్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఇది విన్ ఫాస్ట్ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తుంది.
విన్ ఫాస్ట్ తన సర్వీస్ మాన్యువల్స్, డయాగ్నస్టిక్ టూల్స్, టెక్నీషియన్లకు ట్రైనింగ్, వారంటీ కవరేజ్ ప్రక్రియలను అందిస్తుంది. ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడిలో తన మొదటి విదేశీ అసెంబ్లీ ప్లాంట్‌ను ప్రారంభించింది. దీని ప్రారంభ కెపాసిటీ సంవత్సరానికి 50,000 వాహనాలు కాగా, దీనిని 1,50,000 యూనిట్ల వరకు పెంచవచ్చు. ఈ ప్లాంట్ ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. విన్ ఫాస్ట్ అనేక ప్రముఖ డీలర్ గ్రూపులతో భాగస్వామ్యం కుదుర్చుకుని, 2025 చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో తమ ప్రీమియం SUV లైన VF 6, VF 7 లను VinFast విడుదల చేసింది.
