VinFast VF MPV 7 vs Kia Carens Clavis EV: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను చూసి విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్, తన VF MPV 7 మోడల్‌తో భారత ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే మార్కెట్లో పాగా వేసిన కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీకి ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ రెండు కార్లలో ఏది పవర్ఫుల్ ? దేని ఫీచర్లు బాగున్నాయి? ఏది కొంటే లాభం? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మొదటగా ఈ రెండు కార్ల పరిమాణం గురించి మాట్లాడుకుంటే.. విన్‌ఫాస్ట్ VF MPV 7 తన ప్రత్యర్థి కంటే అన్ని విధాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది 4740 mm పొడవుతో కియా క్యారెన్స్ (4550 mm) కంటే దాదాపు 190 mm ఎక్కువగా ఉంది. అలాగే వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్ విషయంలో కూడా విన్‌ఫాస్ట్ దే పైచేయి. ఈ పెద్ద డైమెన్షన్స్ వల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్ చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా కారు వెనుక సీట్లలో కూర్చునే వారికి మంచి లెగ్ రూమ్ లభిస్తుంది. అయితే, కియా క్యారెన్స్ కాస్త చిన్నదిగా ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో పార్కింగ్ చేయడానికి, ట్రాఫిక్ లో నడపడానికి సులభంగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్ విషయంలో ఈ రెండు కార్లు విభిన్నమైన వ్యూహాలను అనుసరిస్తున్నాయి. విన్‌ఫాస్ట్ VF MPV 7 లో ఒకే ఒక పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఎక్కువ రేంజ్ ఇవ్వడంతో పాటు శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌పై దృష్టి పెడుతుంది. మరోవైపు, కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులు తమ బడ్జెట్ కు తగ్గట్టుగా తక్కువ రేంజ్ లేదా ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడల్‌ను ఎంచుకోవచ్చు. కియాలోని పెద్ద బ్యాటరీ ప్యాక్ దాదాపు విన్‌ఫాస్ట్ తో పోటీ పడుతున్నప్పటికీ, కాగితంపై చూస్తే మాత్రం విన్‌ఫాస్ట్ VF MPV 7 ఎక్కువ పవర్, టాప్‌ స్పీడ్‌ను కలిగి ఉంది.

సాంకేతికత విషయానికి వస్తే కియా క్యారెన్స్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. విన్‌ఫాస్ట్ VF MPV 7 లో పెద్ద చక్రాలు, బేసిక్ అవసరాలకు తగ్గట్టుగా టచ్ స్క్రీన్, డిజిటల్ డిస్ప్లే వంటివి ఉన్నప్పటికీ, కియాలో ఫీచర్లు మరిన్ని ఎక్కువ. కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీలో ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లెవల్-2 అడాస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు , ఆరు ఎయిర్ బ్యాగులు వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. విన్‌ఫాస్ట్ డ్రైవింగ్ అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే, కియా మాత్రం ప్రయాణికుల సౌకర్యానికి, వినోదానికి పెద్దపీట వేసింది.

ధరల విషయంలో ఈ రెండు కార్ల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. విన్‌ఫాస్ట్ VF MPV 7 కేవలం ఒకే ఒక హై-ఎండ్ వేరియంట్ లో లభిస్తుంది, దీని ధర రూ.24.49 లక్షలుగా ఉంది. కానీ కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.17.99 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్ మోడల్ రూ.24.99 లక్షల వరకు ఉంటుంది. అంటే తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ ఎంపీవీ కావాలనుకునే వారికి కియా మంచి ఆప్షన్. అదే ఒకేసారి భారీ సైజు, ఎక్కువ పవర్ ఉన్న కారు కావాలనుకుంటే విన్‌ఫాస్ట్ వైపు మొగ్గు చూపవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story