VinFast VF5: టాటా నెక్సాన్ ఈవీకి అసలైన పోటీదారు.. ఇండియా మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ నయా SUV!
విన్‌ఫాస్ట్ నయా SUV!

VinFast VF5: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తన ఉనికిని భారత మార్కెట్లో వేగంగా విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే తన పాపులర్ మోడల్ విఎఫ్5 ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పేటెంట్‌ను భారత్‌లో అధికారికంగా దాఖలు చేసింది. విదేశాల్లో ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ త్వరలోనే భారత రహదారులపై పరుగులు తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
స్టైలిష్ ఎక్స్టీరియర్.. కొత్త లైటింగ్ సిస్టమ్
నూతనంగా రాబోతున్న విఎఫ్5 మోడల్ ముందు భాగంలో ఊహించని మార్పులు ఉండబోతున్నాయి. మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు బోనెట్‌పై విన్‌ఫాస్ట్ ప్రత్యేక ముద్ర అయిన V-ఆకారపు సిగ్నేచర్ స్టైలింగ్ కొనసాగించారు. ఈవీకి తగ్గట్లుగా ముందు భాగంలో పూర్తిగా మూసివేసిన పెద్ద గ్రిల్, కొత్త బంపర్ అమర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో నూతన డిజైన్ ఉన్న అల్లాయ్ వీల్స్ లభించే అవకాశం ఉంది. కారు వెనుక భాగంలో టెయిల్ లైట్లు, ఇండికేటర్లను కలుపుతూ విశాలమైన ఎల్ఈడీ లైట్ బార్‌ను అందించడం ద్వారా వాహనానికి సూపర్ లగ్జరీ లుక్ వచ్చింది.
అత్యాధునిక కేబిన్.. డిజిటల్ ఫీచర్లు
ఇంటీరియర్ విభాగంలో అనేక హైటెక్ మార్పులు కనిపించనున్నాయి. కేబిన్ లోపల పెద్ద పరిమాణంలో ఉండే ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. డ్యాష్‌బోర్డ్‌ను మరింత ప్రీమియం లుక్‌లో రీడిజైన్ చేశారు. రెండు స్పోక్స్ కలిగిన కొత్త స్టీరింగ్ వీల్, గుండ్రటి గియర్ కంట్రోల్స్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ ఉన్నాయి. సీట్ల సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ మునుపటి క్లాత్ సీట్ల స్థానంలో సరికొత్త లేదరెట్ సీట్లను అమర్చారు. సాంప్రదాయ క్లస్టర్ సమాచారాన్ని కూడా స్క్రీన్‌పైనే చూసేలా సిస్టమ్ డిజైన్ చేశారు.
పవర్ఫుల్ బ్యాటరీ ఆప్షన్లు.. మైలేజ్ అంచనాలు
గ్లోబల్ మార్కెట్లో ఈ కారు రెండు రకాల బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇండోనేషియా వర్షన్లో 29.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 90 హెచ్‌పీ పవర్, 135 ఎన్ఎమ్ టాార్క్ ఉత్పత్తి చేస్తూ ఒకే ఛార్జ్‌పై 268 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మరో గ్లోబల్ వేరియంట్లో 37.23 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 136 హెచ్‌పీ పవర్‌తో 326 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తుంది. భారత మార్కెట్లో ఏ బ్యాటరీ సామర్థ్యాన్ని పరిచయం చేస్తారో అనేది కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
భారత మార్కెట్లో ధర ఎంత ఉండవచ్చు?
భారత మార్కెట్లో విన్‌ఫాస్ట్ విఎఫ్5 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ధర సుమారు రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ ధరలో లాంచ్ అయితే, దేశీయ మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ కార్లకు ఇది అత్యంత బలమైన పోటీదారుగా మారుతుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ డిజైన్, టెక్నాలజీ ఇష్టపడే ఈవీ ప్రియులకు ఇది ఒక మంచి ఎంపిక కానుంది.

